శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం ఐదు డిపోల్లో 190 ఆర్టీసీకి చెందిన పల్లెవెలుగు బస్సులుండగా మరో 57 అద్దెవి తిరుగుతున్నాయి. ఇవి నిత్యం గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. కొన్నింటిలో సీట్లు పాడైపోగా మరికొన్నింటికి కిటికీ అద్దాలు పాడై శబ్దాలు వస్తున్నాయి. అద్దాలు అటుఇటు కదలకపోవడం, బిగిసిపోవడం, వర్షానికి కారిపోవడం వంటివి జరుగుతుంటాయి. వీటన్నింటిని ప్రస్తుతం నివారించనున్నారు.
తొలిదశలో 40 బస్సులకు మరమ్మతులు చేస్తున్నారు. శ్రీకాకుళం 1, 2 డిపోలతో పాటు పలాస, పాలకొండ, టెక్కలి డిపోల్లో నాలుగేసి చొప్పున బాగు చేస్తున్నారు. పాతవాటికి బాడీని మారుస్తున్నారు. పాత వస్తువులను తొలగించి కొత్తవి అమర్చుతున్నారు. సిగ్నల్ లైట్లు, బ్రేక్‌షూలు, అడుగు భాగంలో ఉన్న రేకులను మారుస్తున్నారు. కొత్త వాహనాల మాదిరిగా తీర్చిదిద్దుతున్నారు. డివిజినల్ మేనేజర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు శ్రీకాకుళం డిపో డీఎం ప్రవీణ తెలిపారు.