ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 10, 2021, 12:34 PM IST

ETV Bharat / state

మహమ్మారిపై యోగాస్త్రం!

యోగా...ధ్యానం...ప్రాణాయామం...చేయడంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో వీటి ప్రాధాన్యం మరింత ఎక్కువైంది. చాలామంది వ్యాయామంతో పాటు యోగా సాధనను దినచర్యగా మార్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కొవిడ్ కేంద్రాల్లో వీటిని సాధన చేయిస్తున్నారు.

Practicing Yoga at Covid Care Centers
Practicing Yoga at Covid Care Centers

కొవిడ్‌ బారిన పడినవారు యోగా చేస్తే మరింత త్వరగా వీరికి ఉపశమనం కలుగుతుందని భారత ప్రభుత్వ ఆయూష్‌ విభాగం ఇప్పటికే సూచించింది. దీంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, జేసీ కె.శ్రీనివాసులు ప్రత్యేక దృష్టి సారించి కొవిడ్‌ కేర్‌ కేంద్రాల్లో ఉంటున్నవారికి యోగా నేర్పించాలని నిర్ణయించారు. ఆ దిశగా నిత్యం వారితో సాధన చేయిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో రెండు చోట్ల కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం పాత్రునివలస టిడ్కో గృహాల్లో ఒకటి, సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురంలో మరొకటి ఉన్నాయి. పాత్రునివలస కేంద్రంలో ప్రస్తుతానికి 845 మంది ఉన్నారు. వీరికి వైద్యంతో పాటు నిత్యం పోషకాహారం అందిస్తున్నారు. దీంతో పాటు రోజులో రెండు గంటల పాటు శారీరక వ్యాయాయంతో పాటు యోగా, ధాన్యం, ప్రాణాయామాలను కూడా చేయిస్తున్నారు. కరోనా బాధితుల్లో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేందుకు ఇది దోహదపడుతుందని శిక్షకులు చెబుతున్నారు. ధాన్యం, యోగా చేయడంతో వీరు త్వరగా కోలుకుంటారని అంటున్నారు.

ఆరోగ్యం మెరుగుపడుతుంది...

కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో నిత్యం రెండు గంటల పాటు యోగా సాధన చేయిస్తున్నారు. మందులతో పాటు మంచి ఆహారం అందిస్తున్నారు. అందరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొవిడ్‌ ఉన్నట్టే అనిపించడం లేదు. మేము చాలా దైర్యంగా ఉన్నాం. - శాంతి, శ్రీకాకుళం

ఉత్సాహంగా ఉంటున్నా...

నేను ఇటీవల కరోనాబారిన పడ్డాను. కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో ఉంటున్నాను. ఇక్కడ ప్రతిరోజూ యోగా చేయడంతో చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతున్నాను. వ్యాయామంతో పాటు, యోగాసానాలు కూడా సాధన చేస్తున్నాం. - రామలక్ష్ము, రాజాం

ఇంటికి వెళ్లినా సాధన చేసేలా..

ఇక్కడ యోగా సాధన చేయిస్తుండటం ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. మా అందరిలో ధైర్యం నింపేందుకు, నిస్తేజాన్ని దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇంటి దగ్గరకు వెళ్లిన తరవాత కూడా యోగా, ప్రాణాయామాలు సాధన చేసుకునేలా తర్ఫీదు ఇస్తున్నారు. - గణేష్‌, శ్రీకాకుళం

ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం...

కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో ప్రతి బాధితుడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. నిత్యం రెండు గంటలపాటు అందరితో యోగా సాధన చేయిస్తున్నాం. మానసికంగా ఎలా ధైర్యంగా ఉండాలో వివరిస్తున్నాం. దీనిపై వారంలో మూడు రోజులు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తునాం. బుర్రకథలు కూడా ప్రదర్శిస్తున్నాం. ఇక్కడ ఉన్నవారిని సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి పంపాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నాం. - జి.రవికుమార్‌, కొవిడ్‌ కేర్‌ కేంద్రం నోడల్‌ అధికారి

మనోధైర్యం కల్పించాలని..

కొవిడ్‌ బాధితుల ఆరోగ్యం మెరుగుపరచడంతో పాటు వారిలో మనోధైర్యం కల్పించేందుకు యోగా సాధన దోహదపడుతుంది. ఆయుష్‌ వైద్య విభాగం సూచించిన ఆసనాలు, ప్రాణయామాలను బాధితులందరూ కోలుకుని ఇంటికి వెళ్లినా సాధన చేసుకునే విధంగా నేర్పిస్తున్నాం. - డా.చిలుకు లక్ష్మీకాంత్‌, యోగా, ప్రకృతివైద్యులు

భయపడాల్సిన అవసరం లేదు....

బాధితుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలనే కొవిడ్‌ కేర్‌ కేంద్రంలో యోగా, ధ్యానం, ప్రాణాయామాలు చేయిస్తున్నాం. మానసికంగా ఎలాంటి ఒత్తిడికి లోనయినా బాధితులు నిరాశ చెందుతారు. ప్రతి ఒక్కరిలోనూ ధైర్యం నింపాలని, వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాం. వారు మనోనిబ్బరంతో ఉండేందుకు యోగా చేయిస్తున్నాం. - జె.నివాస్‌. కలెక్టర్‌

ఇదీ చదవండి

ఇష్టానుసారం సీటీ స్కాన్‌ వద్దు

ABOUT THE AUTHOR

...view details