ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫొని ఎఫెక్ట్​.. శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వర్షాలు

శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరాల్లో అలలు ఎగిసి పడుతున్నాయి. తుపాను ప్రభావంతో ఈదురుగాలులు వీచి భారీగా వర్షం కురుస్తోంది. పలాస, టెక్కలి, సంతబొమ్మాళి ప్రాంతాల్లో జడివాన కురుస్తుంది. పునరావాస కేంద్రాల్లో పరిస్థితిని కలెక్టర్​ నివాస్​ ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలను సిద్ధంగా ఉంచారు. అగ్నిమాపక శాఖ బృందాలను పంపించామని తెలిపారు.

By

Published : May 2, 2019, 11:27 AM IST

Updated : May 2, 2019, 4:44 PM IST

శ్రీకాకుళం జిల్లాలో కుండపోతగా వర్షాలు

ఫొని ఎఫెక్ట్​.. శ్రీకాకుళం జిల్లాలో కుండపోత వర్షాలు

శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర మండలాల్లో పరిస్థితులు మారుతున్నాయి. పలాస, టెక్కలి, సంతబొమ్మాళి, శ్రీకాకుళంలో వాన కురుస్తోంది. మిగిలిన సముద్ర తీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ఆమదాలవలస మండల ప్రాంతాల్లో ఫొని తుపాను కారణంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది ఇవాళ ఉదయం 10 గంటల నుంచి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఈదురుగాలులు వీచిన అనంతరం భారీగా వర్షం కురుస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫొని తుపానుపై యంత్రాంగం అప్రమత్తమైంది. తహసీల్దార్​ కార్యాలయంలో కంట్రోల్​ రూమ్​ ఏర్పాటు చేశారు. నాగావళి, వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తహసీల్దార్​ సూచించారు. పునరావాస కేంద్రాల్లో పరిస్థితిని కలెక్టర్​ నివాస్​ ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, సోంపేట, కవిటి, కంచిలి, పలాస, మందస, టెక్కలి, కొత్తూరు, భామిని ప్రాంతాల్లో 9 ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలను సిద్ధంగా ఉంచారు. అగ్నిమాపక శాఖ బృందాలను పంపించామని తెలిపారు.

పాతపట్నం మండలంలో..
పాతపట్నం మండలంలో ఫొని తుఫాను ప్రభావం చూపుతుంది. ఇవాళ ఉదయం నుంచి ఈదురు గాలులతో భారీ వర్షం పడుతుంది. రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. తహసీల్దార్ కార్యాలయంలో సెట్ కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతాధికారులకు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందిస్తున్నారు. పాతపట్నం మండల కేంద్రంలో పునరావాస కేంద్రాల్లో భోజనాలు సిద్ధం చేస్తున్నారు. వరద బాధిత గ్రామాల ప్రజలకు భోజనాలు అందించనున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

ఆందోళనలో ఉద్దాన ప్రాంత ప్రజలు..
తుపానుతో ఉద్దాన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తితిలితో సర్వం కోల్పోయిన ఉద్దానం ప్రాంత ప్రజానీకానికి ఫొని తుఫానుతో మరింత నష్టం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పలాస నియోజకవర్గంలోని తీర ప్రాంతంలో మత్స్యకారులు తమ బోట్లను యంత్రాల సహాయంతో ఒడ్డుకు చేర్చుకుంటున్నారు. సహాయక చర్యల కోసం విద్యుత్ శాఖ అధికారులు ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని పలాస ప్రాంతానికి తరలిస్తున్నారు.

నరసన్నపేట నియోజకవర్గంలో..
నరసన్నపేట నియోజకవర్గంలో పోలాకి మండలం రాజారాంపురం, గుప్పెడుపేట తదితర ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. నరసన్నపేట మండలం కామేశ్వరిపేట, ముద్దాడపేట, భవానిపేట, కామేశ్వరిపేట, లుకలాం తదితర వంశధార నది తీర గ్రామాల్లో ప్రత్యేక అధికారి, తహసీల్దార్, తదితరులు గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లుకలాంలో ప్రత్యేకంగా జనరేటర్లను ఏర్పాటు చేసి తాగునీటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ముద్దాడపేటలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

పాలకొండలో..
నాగావళి నది తీర ప్రాంతమైన పాలకొండలో వాతావరణంలో మార్పులు సంభవించాయి. ఉదయం నుంచి మబ్బులుతో కూడిన వాతావరణం నెలకొంది. చిరు జల్లులు పడుతున్నాయి. పాలకొండ పట్టణంలో స్థానిక అగ్నిమాపక కేంద్రం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పైకప్పు పూర్తిగా కోల్పోవడంతో ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. కేంద్రంలో పది మంది సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటారు. భవనం వినియోగానికి పనికిరాదని పదేళ్ల కిందటే ఆర్అండ్​బీ అధికారులు తేల్చిచెప్పారు. గత్యంతరం లేక శిథిల భవనంలోనే సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 65 లక్షల నిధులు మంజూరు చేసినా... నిర్మాణం ప్రారంభం కాలేదు. స్థానిక పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి కూడా ఇదే దుస్థితి. ప్రభుత్వం 35 లక్షల నిధులు మంజూరు చేసింది. రెండేళ్ల కిందటే భవన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కేంద్రంలో ఉన్న స్థలాన్ని దుర్గమ్మ ఆలయానికి కేటాయించాలని అప్పటి పాలకవర్గం తెలిపింది. దీంతో కలెక్టర్ లక్ష్మీనరసింహ నిర్మాణాలను నిలుపుదల చేయించారు. ప్రత్యామ్నాయంగా చూపించకపోవడంతో భవనంలోనే సిబ్బంది విధులు నిర్వహించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఫొని తుపాను నేపథ్యంలో కురుస్తున్న వర్షాలకు ఎప్పుడు భవనాలు కూలిపోతాయో అంటూ సిబ్బంది భయాందోళనలు చెందుతున్నారు.

ఎచ్చెర్ల నియోజకవర్గంలో..
ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలాల్లో ఫొని తుపాను ప్రభావం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తీవ్రరూపం దాల్చింది. తుపాన్ ప్రభావంతో వర్షం భారీగా కురుస్తోంది. ప్రస్తుతం ఈదురు గాలులు దట్టంగా ఉండడంతో బొప్పాయి, మొక్కజొన్న, అరటి తదితర వాణిజ్య పంటలు సాగు చేస్తున్న రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బొప్పాయి, అరటి... కాపు దశలో ఉండడంతో గాలులకు నేలమట్టమయ్యే అవకాశం ఉందని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి అకాల వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. తుపానుతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. తీరప్రాంత మండలాలైన రణస్థలం, ఎచ్చెర్లల్లో మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. సాయంత్రానికి తుపాను ప్రభావం ఎక్కువయ్యే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.

పలు రైళ్లు రద్దు..
శ్రీకాకుళం రైల్వేస్టేషన్‌ను వాల్తేరు డీఆర్‌ఎం శ్రీవాత్సవ సందర్శించారు. శ్రీకాకుళం మీదుగా విశాఖ వైపు వెళ్లే 74 రైళ్లను రద్దు చేశారు. నేడు, రేపు రైళ్లను రద్దు చేస్తున్నట్లు డీఆర్‌ఎం ప్రకటించారు.

కలెక్టర్​ సమీక్ష..
ఫొని తుపాను ప్రభావంపై కలెక్టర్ జె.నివాస్‌ సమీక్ష నిర్వహించారు. ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, నందిగం, పలాస, సంతబొమ్మాళిలో 140 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్​ సూచించారు.

Last Updated : May 2, 2019, 4:44 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details