ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జిల్లా అధికార యంత్రాంగం పనితీరు భేష్‌' - carona cases in srikakulam

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదవ్వటంతో జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు అహర్నిశలు శ్రమించిన జిల్లా అధికార యంత్రాంగం మరింత కష్టించి పనిచేయాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ‌ అధికారులను ఆదేశించారు. ‌

srikakulam district
పాతపట్నం ప్రాంతంలో పర్యటిస్తున్న మంత్రులు, జిల్లా అధికారులు

By

Published : Apr 27, 2020, 9:55 AM IST

శ్రీకాకుళం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం, ఆరోగ్యశాఖ మంత్రి మంత్రి ఆళ్ల రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలు సిద్ధంగా ఉంచాలని, వైద్యులు, వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ కిట్లు (పీపీఈ) ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రి సూచించారు.

జిల్లాలో కరోనా వైరస్‌ నివారణకు సంబంధించి సర్వేను మరోసారి పక్కాగా చేయాలని కలెక్టర్‌ జె.నివాస్‌ను ఆదేశించారు. జిల్లాలో కరోనా వైరస్‌ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతామన్నారు. జిల్లాలోని పాతపట్నం ప్రాంతంలో కంటైన్మెంట్‌ జోన్‌ను గట్టిగా అమలు చేయాలని ఆదేశించారు. కంటైన్మెంట్‌ జోన్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఫీవర్‌ ఆసుపత్రులుగా మార్చాలని, అవసరమైతే గ్రామ సచివాలయాల్లో కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.
క్వారంటైన్‌లో ఉంచాం

దిల్లీ నుంచి జిల్లాకు వచ్చిన వారి వివరాలు సేకరించి క్వారంటైన్‌లో ఉంచామని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. క్వారంటైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ క్యూఆర్‌ కోడ్‌ ఇచ్చామని, ప్రతి పది మందికి ఒక వైద్యాధికారిని నియమించామని, 15,483 మందిని క్వారంటైన్‌లో ఉంచామని వివరించారు. జ్వరం, దగ్గు తదితర లక్షణాలతో బాధపడుతున్నవారు 3,718 మందిని గుర్తించామన్నారు. జిల్లాలో 32 క్వారంటైన్‌ కేంద్రాల్లో 4,277 పడకలున్నాయని, 1,405 విడి గదులున్నాయని తెలిపారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో రెండు వేల పడకలు, కొవిడ్‌ ఆసుపత్రిలో 32 ఐసీయూ, 800 నాన్‌ ఐసీయూ పడకలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో జెమ్స్‌ ఆసుపత్రితో పాటు డాక్టర్‌ గొలివి, శాంతి ఆసుపత్రులను కొవిడ్‌ ఆసుపత్రులకు సిద్ధం చేశామని, 47 వెంటిలేటర్లు ఉన్నాయన్నారు. అదేవిధంగా జిల్లాలో 54 మంది వైద్యుల నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చామన్నారు. సమీక్షలో విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శ్రీకాకుళం, ఎచ్చెర్ల ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్‌కుమార్, కొవిడ్‌ జిల్లా ప్రత్యేకాధికారి ఎం.ఎం.నాయక్, జేసీ శ్రీనివాసులు, ఐటీడీఏ పీవో సాయికాంత్‌వర్మ పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


పాతపట్నంలో మంత్రుల పర్యటన

పాతపట్నంలో ఉన్న అంతర్రాష్ట్ర సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రానికి ఆదివారం మంత్రులు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్‌ వచ్చారు. కలెక్టరు జె.నివాస్, ఎసీˆ్ప ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డితో మాట్లాడి స్థానిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో నాలుగు మండలాల్లోని 18 పంచాయతీల్లోని 27 గ్రామాలను రెడ్‌ జోన్‌గా గుర్తించామని కలెక్టర్‌ వారికి వివరించారు. స్థానిక సామాజిక ఆసుపత్రిలో కొవిడ్‌-19 పరీక్షలను నిర్వహిస్తామని, తక్షణమే ఫలితాలొచ్చే విధంగా 500 ర్యాపిడ్‌ కిట్లను అందుబాటులోనికి తీసుకొచ్చామన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజలకు ఇళ్ల వద్దకే నిత్యావసర సరకులు, పాలు, కూరగాయలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టామని, ఇళ్ల వద్దకు మొబైల్‌ ఏటీఎంలు వచ్చేవిధంగా చూస్తున్నామని తెలిపారు. ఇక్కడ వైద్య పరీక్షలను నిర్వహించేందుకు, సర్వేకు అవసరమైన 27 మంది వైద్యులతో కూడిన 267 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ నిరంతరం పోలీస్‌ పికెట్‌ ఉంటుందని, వాలంటీర్ల పర్యవేక్షణ ఉంటుందని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

కరోనా నిర్ధారణ ల్యాబ్‌ ప్రారంభం

జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలకు అవసరమయ్యే ల్యాబ్‌ ప్రారంభించామని, ర్యాపిడ్‌కిట్స్, ట్రూనాట్‌ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి వివరించారు. కరోనా లక్షణాలు గలవారు, అటువంటివారిని ఎవరైనా గుర్తిస్తే 94905 76658 నెంబరుకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.

కేసులు నమోదవ్వటం దురదృష్టకరం

జిల్లాలో పాజిటివ్‌ కేసులు నమోదు కావడం దురదృష్టకరమని, ఇప్పటివరకు నాలుగు కేసులు నమోదు అయ్యాయని, (అధికారికంగా మూడు కేసులు ప్రకటించారు) రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వీరిని కొవిడ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. జిల్లాకు విదేశాల నుంచి 1,445 మంది వచ్చారని, వీరితో సంబంధాలున్న 4,271 మంది, దిల్లీ నుంచి వచ్చిన 230 మంది, ముంబయి నుంచి వచ్చిన 488 మందిని క్వారంటైన్‌లో ఉంచామన్నారు.

మత్స్యకారులను రప్పించాలని విజయనగరం ఎంపీ వినతి: గుజరాత్‌ రాష్ట్రంలో చిక్కుకున్న ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మత్స్యకారులను రప్పించాలని కోరుతూ విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందించారు. దీనిపై స్పందించిన ఆయన మత్స్యకారులను రప్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

అంతటా అప్రమత్తం

జిల్లాలోని పాతపట్నం ప్రాంతంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన నేపథ్యంలో పాతపట్నం, హిరమండలం, సారవకోట, కొత్తూరు మండలాలకు చెందిన 27 కంటైన్‌మెంట్ గ్రామాలను అప్రమత్తం చేశారు. ప్రధానంగా పోలీసు, వైద్య సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీ అధికారులు ముమ్మర పనులను చేపడుతున్నారు. * ఆయా గ్రామాల్లో పాలకొండ డీఎసీˆ్ప రారాజు ప్రసాద్‌ పర్యవేక్షణలో నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్‌.ఐ.లు, 120 సిబ్బందితో విధులను నిర్వహిస్తున్నారు. లాక్‌ డౌన్‌ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు.

* ఆయా గ్రామాల్లో 18 మంది వైద్యుల పర్యవేక్షణలో 265 బృందాలు పనిచేస్తున్నాయి. ఇవి ప్రజల ఆరోగ్య వివరాలు నమోదు చేస్తున్నాయి. సుమారు 12, 648 గృహాల్లో ఉన్న దాదాపు 41 వేల మందిని సర్వే చేస్తున్నారు.

* గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారుల పర్యవేక్షణలో ట్యాంకర్లతో తాగునీరందిస్తుండడంతోపాటు పారిశుద్ధ్య కార్మికులు బ్లీచింగ్‌ జల్లడంతోపాటు ఫినాయిల్, సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాలు పిచికారీ చేస్తున్నారు. * పాతపట్నం మండలంలోని 27 గ్రామాలను రెడ్‌జోన్‌గా ప్రకటించడంతో పాతపట్నంలో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు.

ఇది చదవండి'ప్రజలకు అండగా నిలుస్తున్నందకు అభినందనలు'

ABOUT THE AUTHOR

...view details