మధుమేహ బాధితులకు ఉపశమనం కలిగిస్తూ భారతీయ వైద్యుల బృందం చేపట్టిన పరిశోధనలు మంచి ఫలితాలనిస్తున్నాయి. పనసకాయలో మధుమేహాన్ని అదుపుచేసే గుణాలు ఉన్నాయని శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసరుగా పని చేస్తున్న ఎ.గోపాలరావుతోపాటు మరికొందరు వైద్యులు గుర్తించారు. దీనికి సంబంధించి ఆయన బృందం చేసిన పరిశోధనలపై అంతర్జాతీయ జర్నల్‌లో వ్యాసం ప్రచురితమైంది.
పనసకాయలో మధుమేహాన్ని అదుపు చేసే ఫైబర్, మినరల్స్, యాంటీ డయాబెటిస్ పదార్థాలు ఉంటాయని ఈ సందర్భంగా గోపాలరావు వెల్లడించారు. ఈ కాయతో లభించే పదార్థాలతో పుణేలోని ఓ కంపెనీ పౌడర్ తయారు చేస్తోందని తెలిపారు. ‘దీనిలో మధుమేహ వ్యాధిగ్రస్థులకు ప్రయోజనం ఉంటుందేమోనని ప్రయోగాలు చేశాం. ఇందులో భాగంగా 2019 మే నెలలో నాతోపాటు సహచర వైద్యులు కె.సునీల్ నాయక్, రీసెర్చ్ వైద్యులు మురళీధర్, శ్రీనివాస్ సంయుక్తంగా 40 మందిపై ఏడాదిపాటు పరిశోధన చేశాం. ఆసుపత్రిలో ఏడాది కాలంగా మధుమేహ వ్యాధి అదుపునకు మాత్రలు వినియోగిస్తున్న వారికి గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్ (హెచ్‌బీఏ1సి) పరీక్షలు నిర్వహించాం. ఈ పరీక్షలో ఆరు పాయింట్లు లోపు ఉన్న వారికి చక్కెర ఉండదు. 6 దాటి 8 పాయింట్లు వచ్చిన వారిని 40 మందిని గుర్తించి జాక్‌ఫ్రూట్ పౌడర్‌తో పాటు, ఇతర డమ్మీ మందులు (ప్లాసిబో-వీట్‌ఫ్లోర్) ఇచ్చాం. మూడు నెలలు నిశితంగా పరిశీలించాం. ముఖ్యంగా టైప్2 మధుమేహ వ్యాధి పీడితుల్లో ప్లాస్మా గ్లూకోజ్ స్థాయి తగ్గించడంతో ఇది ప్రభావవంతంగా పని చేస్తుందని గుర్తించాం.