ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 పరీక్షలు ప్రారంభమయ్యాయి.. అభ్యర్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షకు హాజరయ్యారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించిన వారిని మాత్రమే కేంద్రాలలోకి పంపించారు. నేటినుంచి ఈనెల 20 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 41 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ విధానంలో భాగంగా అభ్యర్థులకు తొలిసారిగా ట్యాబ్‌లో ప్రశ్నపత్రాన్ని అందజేశారు. అభ్యర్థి లాగిన్ అయ్యాక తెరపై ప్రశ్నపత్రం కనిపించేలా ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల శ్రీశివానీ ఇంజినీరింగ్, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలల్లో 312 మంది అభ్యర్ధులు పరీక్షలు రాస్తున్నారు. ప్రతీ రోజూ ఉదయం 10గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు తెలిపారు. సకాలంలో రాని అభ్యర్థులను లోనికి అనుమతించబోమని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఏవైనా సమస్యలు తలెత్తితే ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారి. పైడి ఢిల్లీశ్వరరావు ఫోన్నెంబర్కు 90145 50915 సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.