అనిశా అధికారినంటూ ఒకరిని మోసం చేసి డబ్బులు డిమాండ్ చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం ప్రభుత్వాసుపత్రిలో తిరుపతిరావు, అప్పలనాయుడు అనే ఇద్దరు వ్యక్తులు ల్యాబ్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. వీరిద్దరూ ప్రైవేటుగా ల్యాబులు నడుపుతున్నారు. ఈ క్రమంలో అప్పలనాయుడు తనకు పోటీగా ఉన్నాడని తిరుపతిరావు భావించాడు.
ఇదిలా ఉండగా ఇటీవల అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించి వీరిద్దరూ ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తూ... ప్రైవేటుగా ల్యాబులు పెట్టుకున్నట్లు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేశారు. దీనిగురించి ఈనెల ఒకటో తేదీన వారిని విచారణ కోసం అధికారులు శ్రీకాకుళం పిలిపించారు. ఈ క్రమంలో అప్పలనాయుడిని బెదిరించాలని తిరుపతిరావు ఆలోచించాడు. తన స్నేహితుడైన విశ్రాంత సైనికోద్యోగి మురళీకృష్ణ సహకారంతో ప్రణాళిక వేశాడు.