ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 8, 2020, 2:44 PM IST

Updated : Jan 8, 2020, 3:15 PM IST

ETV Bharat / state

ఆ కుటుంబాలకు సంక్రాంతి ముందే వచ్చింది...!

దాయాది దేశం నుంచి విడుదలై వస్తున్నారన్న కబురు ఆ కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. 14 మాసాలు నరకయాతన అనుభవించిన బంధువులు వారి రాకతో ఊపిరి పీల్చుకున్నారు. వారికి నిజమైన సంక్రాంతి ముందే వచ్చిందన్న సంతోషం వ్యక్తమవుతోందా కుటుంబాల్లో.

fishermans family reaction after released from pak
మత్స్యకారుల కుటుంబాల్లో వెల్లువిరిసిన ఆనందం

మత్స్యకారుల కుటుంబాల్లో వెల్లివిరిసిన ఆనందం
ఏడ్చి ఏడ్చి.. నీళ్లింకిపోయిన ఆ కళ్లల్లో ఒక్కసారిగా వెలుగులు నిండాయి. మౌనంగా రోదిస్తూ.. శోకంతో గడిపిన ఆ ముఖాల్లో సంతోషం కనిపించింది. మూగబోయిన ఆ గొంతుల్లో మళ్లీ మాటల గలగలా వినిపించాయి. బెంగతో మంచం పట్టిన పెద్దలు లేచి నడుస్తాం.. అనేంత హుషారొచ్చింది. వీరందరికీ 14 నెలలు చీకట్లో బతికినంత పనైంది. భర్త ఎప్పుడొస్తాడా అని భార్య... తండ్రి తమ వద్దకు ఎప్పుడొస్తాడోనని బిడ్డలు.. తమ కుమారులను మళ్లీ చూడాలని తల్లిదండ్రులు. ఇలా పేగు బంధాలన్నీ కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసేవారు. ఇన్నాళ్లకు వీరి ఆశలు ఫలించాయి.

సిక్కోలుకు జాలర్లు

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మత్స్యకారుల గ్రామాల్లో ఆనందం వెల్లివిరిసింది. కుటుంబ పోషణ నిమిత్తం గుజరాత్‌లో చేపలవేటకు వెళ్లి పాకిస్థాన్‌ దళాలకు చిక్కిన జాలర్లు వస్తున్నారన్న వార్త ఆ పల్లెలకు పండుగ తెచ్చింది. గతేడాది బందీలైన వారిని తలచుకుంటూ ఆవేదనతో ముగిసిన సంక్రాంతి.. ఈఏడాది మత్స్యకారుల ఆగమనంతో ఆనందమయమైంది.

14 నెలలుగా ఎదురుచూపులు

14 నెలలుగా ఎప్పుడు విడుదలవుతారో.. ఎలా ఉన్నారో.. తెలియక.. దుఖసాగరంలో మునిగాయి ఆ మత్స్యకార కుటుంబాలు. ఆవేదనల మధ్య బతుకీడుస్తున్న బాధితుల్లో ఈ సంవత్సరం కొత్త ఉత్తేజాన్ని నింపింది. వీరు చేసిన విన్నపాలు నెరవేరి.. పాక్ చెరలో చిక్కిన జాలర్లు స్వస్థలానికి చేరుకుంటున్నారు. బందీలైన వారిలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం డీ మత్స్యలేశం, కే మత్స్యలేశం, బడివానిపేట, ముద్దాడ గ్రామాలకు చెందిన 15 మందితో పాటు విజయనగరం జిల్లా బోగాపురం మండలం బర్రిపాలెం, పూసపాటిరేగ మండలం తిప్పలవలస చెందిన ఐదుగురు మత్స్యకారులు ఉన్నారు. అప్పటి నుంచి బాధిత కుటుంబాలు ప్రజాప్రతినిధులను కలిసి వీరి విడుదలకు చర్యలు తీసుకోవాలంటూ విన్నవించారు.

ఎంపీల చొరవతో

మత్స్యకారులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్​నాయుడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జాలర్ల కుటుంబాలతో కలిసి విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి విదేశాంగశాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జై శంకర్‌ను కలిశారు. విదేశాంగశాఖ ప్రయత్నంతో పాకిస్థాన్ ప్రభుత్వం మత్స్యకారులను విడుదల చేసింది. తమ వారి రాక కోసం స్థానికులు, బాధిత కుటుంబసభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి:

నేడు భారత్​లో అడుగుపెట్టనున్న మత్స్యకారులు

Last Updated : Jan 8, 2020, 3:15 PM IST

ABOUT THE AUTHOR

...view details