ఓ పాత మోటారుపంపు.. దానికి అనుసంధానంగా యాక్సిల్.. దాన్ని తాకుతూ ద్విచక్రవాహనం వెనుక టైరు.. అంతే విద్యుత్తు అవసరం లేకుండానే పంపు నుంచి జలజలా నీటి ప్రవాహం. లీటరు పెట్రోలు ఖర్చుతో గంటన్నరపాటు నీటిధార వస్తుంది. ఎండిపోతున్న వరి నారుమడులకు జీవం పోసే ఈ ఆలోచనను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని తేలుకుంచి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆవిష్కరించాడు. రైతుల కష్టాలు చూసి చలించిన ఆ యువకుడు వారికి ఏదైనా చేయాలనుకొని ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు చాలా తక్కువ ఖర్చుతో పంట భూములకు నీరందించే ప్రయోగం చేసి అన్నదాత లకు ఊరటనిచ్చాడు. ఆ యువకుడే పాల దిలీప్ కుమార్.
నీరు లేక నాట్లు వేయనివారు.. నాట్లు వేసినా, అవి ఎండిపోతున్న పరిస్థితిని ఎదుర్కొంటున్న రైతులే ఎక్కువ. పెట్టిన పెట్టుబడి రాదని.. రైతులు కూడా తిండిగింజలను కొనుక్కోవాల్సిన దుస్థితిని గమనించిన ఇచ్ఛాపురంలోని తేలుకుంచికి చెందిన పాల దిలీప్‌కుమార్ వారికోసం ఓ ప్రయోగం చేశాడు. ఓ పాత మోటారు పంపును రూ.600లకు కొనుగోలు చేసి దానికి బొడిపెల యాక్సిల్‌ను అనుసంధానించి, అది పనిచేసేందుకు మరో రూ.600 వెచ్చించాడు. ఆ యాక్సిల్‌ను తాకేలా ద్విచక్రవాహనం వెనుకటైరుకు పెట్టి, వాహన ఇంజిన్‌ను ఆన్ చేశాడు. అంతే.. చక్రం గిరగిరా తిరుగుతూ, పంపును పనిచేసేలా చేసింది. దీంతో దూరంగా ఉన్న నీటిని సేకరించిన పంపుసెట్ నుంచి నీరు గలగలా పారి పంట పొలాల్లోకి చేరింది.
- ఖర్చు తక్కువే
2 హెచ్‌పీ మోటారు కొనాలంటే రూ.15 వేలు అవుతుంది. అది గంటపాటు పనిచేస్తే 4.5 యూనిట్ల విద్యుత్తు ఖర్చవుతుంది. అదే అద్దెపంపులు అయితే గంటకు రూ.230 నుంచి రూ.250 వరకూ పెట్టుబడి పెట్టాలి. ఎలా చూసినా నీరు పెట్టేందుకు అన్నదాతకు రూ.వేలల్లో ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ ఖర్చు తగ్గించేందుకు ద్విచక్ర వాహనంతోనే నీటి పంపును పనిచేయించిన దిలీప్‌కుమార్ తమకు ఎంతో మేలుచేశారని తేలుకుంచి రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
- రైతుల కష్టాలు చూడలేకే...
సాగునీటి కోసం గత మూడు నెలలుగా నదీతీర ప్రాంతంలోని రైతులు పడుతున్న కష్టాలను చూసి, ఎన్నో ప్రయోగాలు చేశాను. వీరికి విత్తనాలు, ఎరువులు, ఇతర ఉపకరణాలు అన్నీఉన్నా, నీరు లేకపోవడంతో సాగు చేయడం కష్టంగా మారింది. అందుకే ఈ ప్రయోగం చేశా. అది ఫలించింది. రైతులు ఎవరికివారే ఈ విధానంలో పంటలకు నీరందించి కాపాడుకోవచ్చు.