Betting gang arrest in Noida: దిల్లీలో గేమింగ్, బెట్టింగ్‌ల పేరుతో కోట్లు కొల్లగొట్టిన సైబర్ ముఠాను తెలంగాణ రాష్ట్రం సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 8 మంది సభ్యులున్న ముఠా బ్యాంకు ఖాతాల్లోని రూ. 41 కోట్లు జప్తు చేశారు. ఒక సైబర్ నేరానికి సంబంధించి, ఇంత భారీ మొత్తంలో సొమ్మును జప్తు చేయడం దేశంలోనే ఇదే ప్రథమమని పోలీసులు తెలిపారు.
Online Gaming Fraud Case: గతేడాది డిసెంబరులో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలానికి చెందిన హర్షవర్థన్ అనే యువకుడు గేమ్‌కింగ్ 567 డాట్ కామ్‌లో గేమ్ ఆడుతూ 98 లక్షలకుపైగా నగదు పోగొట్టుకున్నాడు. అయితే ఆ డబ్బు ఎక్కడికి చేరిందనే అంశంపై నిఘా పెట్టిన సైబర్ పోలీసులు ఫోన్ పైసా సంస్థ ఖాతాకు చేరినట్లు గుర్తించారు. దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులకు దిల్లీ కేంద్రంగా ఈ చీకటి దందా నడుస్తున్నట్లు తెలిసింది.
Cyber gang arrested in Noida : వెంటనే నిందితుల కదలికలపై నిఘా ఉంచి, మొదట దిల్లీలో ఒకరిని అరెస్టు చేశారు. అనంతరం ఆరా తీయగా, నోయిడాలో ఖరీదైన నివాస సముదాయంలో వ్యవహారం నడిపిస్తున్నట్లు గుర్తించారు. రెక్కీ నిర్వహించి మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాల నుంచి రూ. 41 కోట్లు జప్తు చేయడంతోపాటు 193 సెల్‌ఫోన్లు, 21 ల్యాప్‌టాప్‌లు, 21 పీవోఎస్ యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad Police Have Arrested Cyber Gang: విదేశాల్లో ఉండే కొందరు సైబర్ నేరగాళ్ల కనుసన్నల్లో ఈ ఆన్‌లైన్ గేమింగ్ దందా నడుస్తోందని పోలీసులు తెలిపారు. బెంగళూర్, ఉత్తరాఖండ్‌కు చెందిన 8 మంది వ్యక్తులు గతంలో నకిలీ కాల్‌సెంటర్లలో టెలీకాలర్లుగా పనిచేశారు. అయితే వీరి సమాచారం సేకరించిన సైబర్ నేరగాళ్లు వీరిని సంప్రదించారు. తమతో కలిస్తే భారీగా కమీషన్లు ఇస్తామని ఒప్పించారు. వెంటనే గేమింగ్ దందాను మొదలుపెట్టించారు.