శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణం గాయత్రి కాలనీకి చెందిన చీర శ్రీనివాస నాయుడు(52) ఆచూకీ కోసం కుటుంబ సభ్యులకు కొన్ని వారాలుగా వెతుకుతున్నారు. భార్య రాజేశ్వరి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... జులై 16 తేదీన జ్వరంతో బాధపడుతున్న శ్రీనివాస నాయుడునీ రాజాం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్ సదుపాయం లేకపోవటంతో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి తీసుకెళ్లారు. అదేరోజు నమూనాలు సేకరించి కరోనా అనుమానిత కేసుగా గుర్తించి జెమ్స్ కొవిడ్ ఆసుపత్రికి రిఫర్ చేసి అక్కడికి తరలించారు.
- పరీక్షల్లో నెగిటీవ్...
అతనికి చేసిన పరీక్షల్లో నెగిటివ్ నివేదిక రావటంతో డిశ్చార్జ్ చేయాలని కోరామని, అయితే శ్వాస తీసుకోవటం ఇబ్బంది ఉందని, తర్వాత పంపుతామని వైద్యులు తెలిపారని శ్రీనివాసనాయుడి భార్య పేర్కొంది. ఎప్పటికీ డిశ్చార్జి చేయకపోవటంతో కుటుంబ సభ్యులు గట్టిగా నిలదీశారు. ఈ నేపథ్యంలో జూలై 17వ తేదీనే డిశ్చార్జ్ చేసినట్లు ఆస్పత్రి వర్గాలు చెప్పటంతో కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. సమాచారం ఇవ్వకుండా ఎలా డిశ్చార్జ్ చేస్తారని కుటుంబ సభ్యులు వైద్యులను ప్రశ్నించారు. క్వారంటైన్ కేంద్రాలకు వెళ్లి చూడాలని వైద్యులు సలహా ఇవ్వటంతో శ్రీకాకుళం సమీపంలోని టీడ్కో సెంటర్లో, జిల్లా కేంద్రంలో వెతికారు. చివరకు శవా గారాలలోనూ పరిశీలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవటంతో సిబ్బంది తీరుపై విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 12న శ్రీకాకుళం గ్రామీణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు బాధితులు తెలిపారు. నా భర్త ఆచూకీ చెప్పాలని భార్య రాజేశ్వరి అధికారులను కోరుతుంది.