ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్ధానం రైతుల కష్టాలు: కరోనా లాక్‌డౌన్‌తో నిలిచిన ఎగుమతులు

దిగుబడులు పడిపోయాయి. ధరలు తగ్గిపోయాయి. గిరాకీది అదేబాట. ఎగుమతులు నిలిచిపోయాయి. ఇదీ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం కొబ్బరి రైతు గతంలో ఎన్నడూ ఎదుర్కోని దయనీయ పరిస్థితి. తుపాన్లు, నల్లముట్టే వంటి తుడిచిపెట్టేసే చీడపీడలను సైతం సమర్థవంతంగా ఎదుర్కొన్న సిక్కోలు కొబ్బరి రైతులు కరోనా మహమ్మారి నుంచి మాత్రం బయటపడలేని విపత్కర పరిస్థితి నెలకొంది.

coconut farmers
coconut farmers

By

Published : Jun 22, 2020, 2:24 PM IST

శ్రీకాకుళం జిల్లాలో కొబ్బరి రైతులు కష్టాలు ఎదుర్కుంటున్నారు. గతంలో సంభవించిన వైపరీత్యాల నుంచి కొద్ది రోజుల్లోనే తేరుకున్న రైతులు ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందుల నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు. ఉద్దానం కొబ్బరి తోటల్లో అంతర పంటలుగా రైతులకు కొంత భరోసా ఇచ్చే పనస, మామిడి దిగుబడులు సైతం దిగజారిపోవడం, వచ్చిన అరకొర పంట దిగుబడి సైతం లాక్‌డౌన్‌తో ఎగుమతి లేకపోవడంతో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

తుపాన్లు, ఇతర ఇబ్బందులతో గతంలో దిగుబడులు తగ్గినా రైతులకు వచ్చే ఆదాయం మాత్రం తగ్గేది కాదు. దిగుబడులు తగ్గిన ప్రతి సందర్భంలో ధర గణనీయంగా పెరగడంతో ఇబ్బందులు కనిపించేవి కాదు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఒడిశా, ఉత్తరాది రాష్ట్రాలకు మార్చి నుంచి ఎగుమతులు లేకపోవడంతో ధర గణనీయంగా తగ్గింది. మార్చికి ముందు వెయ్యి కాయలు రూ.22 వేలకుపైగా ధర ఉండగా ప్రస్తుతం రూ.10 వేలు మాత్రమే ఉంది.

సాధారణంగా రెండు నెలల తీతకుగానూ ఎకరాకు సగటున 1200 వరకు కాయలు దిగుబడి వచ్చేవి. తెల్లదోమ విజృంభణ, ఇతర వాతావరణ పరిస్థితులతో కవిటి ఉద్దానంలో ఎకరాకు 350 కాయలు కూడా రాని పరిస్థితి నెలకొనగా, తిత్లీ తుపాను ప్రభావంతో తుడుచుపెట్టుకుపోయిన మందస ఉద్దానంలో వంద కాయలు కూడా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. గతంలో దిడుబడులు తగ్గితే డిమాండు పెరగడంతో ధర అమాంతంగా పెరిగి లోటు భర్తీ అయ్యేది. ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారడంతో రైతులతో పాటు వ్యాపారులు దిక్కులు చూసే పరిస్థితి నెలకొంది.

ఎన్నడూ ఇటువంటి పరిస్థితి ఎదుర్కొనలేదు

తిత్లీ తుపాను సాయంతో కొంతకాలం నెట్టుకొచ్చిన రైతుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. అంతరపంటలైన మామిడి, పనస పంటల దిగుబడులు మచ్చుకైనా ఈ ఏడాది కనిపించకపోవడంతో ఉద్దానం కొబ్బరిరైతుల జీవనోపాధి కష్టతరంగా మారింది.

- బార్ల చిన్నబాబు, కొబ్బరిరైతుల ప్రతినిధి, బల్లిపుట్టుగ, కవిటి మండలం

కొబ్బరి రైతులను ఆదుకోవాలి

జిల్లాలోని ఉద్దానం కొబ్బరి రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలి. తిత్లీ తుపాను సమయంలో ప్రభుత్వం, ప్రతిపక్షం ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు చర్యలు చేపడితే ఉపశమనం కలుగుతుంది.లక్షలాది మంది జీవనోపాధి కల్పిస్తున్న కొబ్బరి విషయంలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి.

-నాగం భాస్కరరావు, కొబ్బరి రైతుల ప్రతినిధి, గొల్లగండి, సోంపేట మండలం

-

ఇదీ చదవండి:

సరిహద్దు ఉద్రిక్తతపై భారత్​- చైనా చర్చలు

ABOUT THE AUTHOR

...view details