BJP MP GVL ON MLC ELECTIONS IN AP : రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచేలా రాష్ట్రంలో పాలన సాగుతోందని విమర్శించారు. ప్రస్తుతం పోలీసు రాజ్యం నడుస్తుందని.. ప్రజాక్షేత్రంలో ఎన్నికైనప్పటికీ పాలకులకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని విమర్శించారు. ఇటువంటి పాలన కొత్త తరహా రాజకీయానికి తెర లేపుతుందని పేర్కొన్నారు.
కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో ఇటువంటి పాలనను ఎన్నడూ చూడలేదని తెలిపారు. ప్రతిపక్షాలను కట్టడి చేసే ప్రయత్నంలో.. వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు గెలుస్తామనడం ప్రభుత్వ అభద్రతాభావానికి నిదర్శనం అని వెల్లడించారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న వైసీపీ ప్రభుత్వం.. నిజమైన అధికారం ఒక కుటుంబం.. ఒకే సామాజిక వర్గంలో కేంద్రీకృతం చేసిందని అన్నారు. బీసీలతో పాటు మైనారిటీలకు నామమాత్రపు పదవులు కట్టుబడు రాజకీయాల్లో భాగమని ధ్వజమెత్తారు. ప్రాంతీయ పార్టీలతో సామాజిక సాధికారత సాధ్యం కాదని పేర్కొన్నారు.