Rooth Maklin Mother of Poor Peoples: ఆమెది ఈ ఊరు కాదు.. ఈ దేశం అంతకంటే కాదు.. బాబా దర్శనార్థం ఎల్లలు దాటి మన దేశానికి వచ్చిన విదేశీయురాలు. సత్యసాయి స్ఫూర్తితో సేవకు శ్రీకారం చుట్టారు. ఆమే లండన్‌కు చెందిన రూత్‌మాక్లిస్ (81). వేల మంది అనాథలకు అమ్మగా మారిన ఆమె ఆదివారం మృతి చెందారు. దీంతో ఆమె బిడ్డలైన అనాథలు గుండెలవిసేలా విలపించారు.
రూత్‌మాక్లిస్ 1941లో లండన్‌లో రూత్‌మాక్లిస్ జన్మించారు. 1995లో ఆమె తన భర్త రాబర్ట్ మాక్లిస్ మరణంతో కుంగిపోయారు. ఆ బాధను మరచిపోవడానికి 1996లో పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి వచ్చారు. ఇక్కడ ఆమె మనసుకు సాంత్వన చేకూరింది. బాబా సేవా కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆమె బాబా సన్నిధిలోనే ఉండాలని నిర్ణయించుకుని సేవా మార్గం వైపు అడుగులు వేశారు. ఇక్కడ పేదరికంతో చదువులకు దూరంగా ఉన్న వీధి బాలలను చూసి చలించారు. వారిని విద్యావంతులను చేయాలన్న ఆలోచనతో మంగళకర చిల్డ్రన్స్ హోమ్‌ను ప్రారంభించి.. ఎందరో అభాగ్యులను అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు నేర్పుతూ దేవాలయంగా మార్చారు. వయస్సు మీద పడటం, ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావడంతో ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు.