సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమం Chandrababu Projects Tour In Satyasai District: వైసీపీకి మళ్లీ ఓటేస్తే..రాష్ట్ర ప్రజలందరికీ ఇక గొడ్డలి పోటేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వై నాట్ 175 అని పులివెందులే అడుగుతున్నందున ప్రజలంతా ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ యువత ప్రపంచంలో ఎక్కడైనా పనిచేసే నూతన విధానానికి శ్రీకారం చూడతామని వెల్లడించారు. కోదమసింహంలా తాను చేసే ధర్మపోరాటంలో ఎవరు అడ్డొచ్చినా ముందుకే గానీ వెనకడుగు వేసేది లేదని తేల్చిచెప్పారు.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా 3వ రోజు సాయంత్రం.. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు భారీగా ప్రజలు పోటెత్తారు. వైసీపీ దుర్మార్గులు సాగునీటి ప్రాజెక్టులను నాశనం చేసి.. రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. ఎగువ రాష్ట్రాలు ఆలమట్టి, తుంగభద్రలపై ప్రాజెక్టులు కడుతున్నందున గోదావరి నీళ్లు రాయలసీమకు రాకుంటే.. భవిష్యత్తులో తీవ్ర నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం పూర్తయితే నదుల అనుసంధానంతో నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. పోలవరం ఎప్పుడు పూర్తిచేస్తారో చెప్పమని అడిగితే.. మంత్రి అంబటి బ్రో సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
బాబాయ్‌ని చంపిన వారెవరో పులివెందుల ప్రజలే స్పష్టంగా చెప్పారన్న చంద్రబాబు..అలాంటి నాయకుడ్ని ఎన్నుకుంటే ప్రజలందరికీ గొడ్డలిపోటేనని హెచ్చరించారు. చెల్లి షర్మిలని అడిగితే జగన్ విశ్వసనీయత గురించి తెలుస్తుందని చెప్పారు. కదిరి సభకు భారీగా వచ్చిన జనసందోహం వద్ద సరైన భద్రత కల్పించకపోవటంపై పోలీసులపై చంద్రబాబు మండిపడ్డారు.
"అంబటి రాంబాబు అంబోతు మాదిరి రంకేలెయ్యటం కాదు. బ్రో సినిమా మీద దిల్లీకి వెెెళ్తాడీ రాంబాబు. పోలవరంపై, రాయలసీమ ప్రాజెక్టులపై రాంబాబు దిల్లీకి వెళ్లాలి. పోలవరాన్ని గోదావరిలో ముంచేసిన దుర్మార్గులు నన్ను విమర్శిస్తారా. పోలవరం ప్రాజెక్టు ఏమవుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది." -చంద్రబాబు
వాలంటీర్లపై చంద్రబాబు స్పందన: ప్రజాసేవ చేస్తున్న వాలంటీర్లను తానేమీ అననన్న చంద్రబాబు.. రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం, వ్యక్తిగత సమాచారం సేకరించడం, ఓట్లను తొలగించే వంటి చర్యలు తీసుకునే వారిని మాత్రం వదిలిపెట్టబోనని స్పష్టం చేశారు. తాను చేసేది ధర్మపోరాటం అన్న చంద్రబాబు.. 6 నెలలపాటు ప్రజలు తనకు సహకారాన్ని అందించాలని కోరారు. 2024లో రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అన్న ఆయన.. రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మిస్తానని భరోసా ఇచ్చారు.
చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకున్న వైసీపీ నేతలు: నేతలు అంతకు ముందు చంద్రబాబు కాన్వాయ్ వస్తుండగా వైసీపీ నేతలు పార్టీ జెండాలు ప్రదర్శిస్తూ రెచ్చగొట్టే ధోరణికి దిగారు. దారిపొడవునా ఉన్న తెలుగుదేశం ఫ్లెక్సీలను సైతం చించేశారు. దీంతో ఆగ్రహానికి గురైన తెలుగుదేశం కార్యకర్తలు వైసీపీ జెండాలు లాగి పడెసి.. వైసీపీ ఫ్లెక్సీలను చించివేశారు.
నాలుగో రోజు చిత్తూరు జిల్లాలో పర్యటన: సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాలుగో రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ములకల చెరువు మండలం సోంపల్లి గ్రామంలో నాయిని చెరువు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించనున్నారు. మధ్యాహ్నం బి.కొత్తకోట మండలం బందరువారిపల్లిలో హంద్రీనీవా కాలవను పరిశీలించనున్నారు. సాయంత్రం చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించి.. రాత్రికి తిరుపతిలో బస చేయనున్నారు.