Ushasri Charan Resort: శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధి కనగానపల్లి మండలం తూంచెర్ల గ్రామ పరిధిలోని సర్వే నంబరు 99లో పవన విద్యుత్తు ప్లాంటు స్థాపనకు సుజలాన్ సంస్థ రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములను సేకరించింది. అప్పట్లో కొంతవరకూ గాలి మరలు ఏర్పాటు చేశారు. ప్లాంటు విస్తరణ కోసం కొంత భూమిని అలాగే వదిలేశారు. దీంతోపాటు తూంచెర్ల సరిహద్దులో ఉన్న కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం నూతిమడుగులలోనూ ఈ సంస్థ భూములను సేకరించింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషకు మంత్రి పదవి వచ్చాక ఆమె కన్ను ఈ భూములపై పడింది. అనుకున్నదే తడవుగా కంపెనీ నుంచి అతి తక్కువ ధరకు భూముల్ని కొనేశారు.
రైతుల నుంచి బలవంతపు కొనుగోళ్లు :సుజలాన్ సేకరించిన భూములను ఆనుకుని నూతిమడుగు గ్రామ రైతుల పొలాలున్నాయి. వీరికి చెందిన సర్వే నంబర్లు 124-2, 3లో 10.92 ఎకరాలు, సర్వే నంబరు 125లో 33.98 ఎకరాలు, సర్వే నంబరు 127లో 10 ఎకరాల చొప్పున మొత్తం 54.9 ఎకరాలను కొన్నారు. ఎకరాకు రూ.1.32 లక్షల చొప్పున చెల్లించినట్లు తెలుస్తోంది. పనులు జరుగుతున్న ప్రాంతానికి ఆత్మకూరు-భానుకోట రహదారి నుంచి ఓ రైతు పొలం మీదుగా ఆయన అనుమతి లేకుండానే రోడ్డు నిర్మించారు. తర్వాత రైతు గొడవ చేయడంతో ఎకరాకు 5 లక్షలు చెల్లించినట్లు చెబుతున్నారు. పక్కనే ఉన్న మరో రైతును పొలం అమ్మాలని ఒత్తిడి తేవడంతో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది.
"మాకు అక్కడ పది ఎకరాలు ఉంది. దౌర్జన్యంగా కంచె వేసేశారు. కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు. దారి లేకుండా చేశారు". - వెంకటేశ్వర్లు, బాధిత రైతు
గుట్టనూ ఆక్రమించేశారు :సర్వే నంబరు 99లో సుజలాన్ సంస్థ సేకరించగా మిగిలిపోయిన భూమిని రైతులు సాగు చేసుకుంటున్నారు. మంత్రి అనుచరులు అందులోని 20 ఎకరాల వరకు ఆక్రమించుకుని కంచె వేసేశారని స్థానికులు చెబుతున్నారు. ప్రశ్నించిన వాళ్లను మీ భూములు ఎప్పుడో సుజలాన్‌కు ఇచ్చేశారు కదా..’ అంటూ దౌర్జన్యం చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. సర్వే నంబరు 99కు ఆనుకుని ఉన్న ఆరు ఎకరాల గుట్టనూ ఆక్రమించేశారని చెబుతున్నారు.