NARA LOKESH YUVAGALAM PADAYATRA : రాష్ట్రంలో మహిళలు, యువత, పేదల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నాను అంటూ భరోసా కల్పించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈరోజు సాయంత్రం శ్రీసత్యసాయి జిల్లాలో ప్రవేశించనుంది. ఇప్పటికే చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ.. అండగా ఉంటూ 550 కిలో మీటర్లకు పైగా పాదయాత్ర చేసిన లోకేష్.. ఈరోజు సాయంత్రం ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని తనకల్లు మండలం చీకటి మానుపల్లికు రానున్నారు.
సత్యసాయి జిల్లాలో దాదాపు నాలుగు రోజుల పాటు లోకేశ్ పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రకు అవసరమైన ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటికే పూర్తి చేశాయి. పాదయాత్ర ఏర్పాట్లను కదిరి నియోజకవర్గ ఇంఛార్జి, మాజీ శాసనసభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్, యువనేత పరిటాల శ్రీరామ్ పరిశీలించారు.
పాదయాత్రలో భాగంగా వివిధ వర్గాలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా సమావేశ మందిరాలు, ఆయన బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేశారు. లోకేశ్‌ను కలవడానికి వచ్చే ప్రజల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని.. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొంటారని వెల్లడించారు. పాదయాత్ర సాగనున్న అన్ని రోజుల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు "మీ కోసం పాదయాత్ర" పేరుతో చేపట్టిన పాదయాత్రను విజయవంతం చేసినట్లే.. యువగళం పాదయాత్రను కూడా అలాగే విజయవంతం చేస్తామని పరిటాల శ్రీరామ్, కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు.