సెల్ఫీ సరదా... ఓ యువతి ప్రాణం తీసింది - photo
సెల్ఫీ సరదా ఓ యువతి ప్రాణం తీసింది. స్వీయచిత్రం తీసుకునేందుకు జలాశయం వద్దకు వెళ్లగా కాలు జారి నీటిలో పడి మృతి చెందింది.
ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ జలాశయంలో కాలు జారి పడి ఓ యువతి మృతి చెందింది. మార్కాపురం సుందరయ్య కాలనీకి చెందిన గాలి ముత్తు కుమారి(22) స్థానిక కందుల ఓబుల్ రెడ్డి ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంగోలులో ఓ కార్యక్రమానికి హాజరై.. అక్కడి నుంచి స్నేహితులతో కలసి గుండ్లకమ్మ జలాశయ సందర్శనకు వెళ్లింది. మరో యువతితో కలిసి కుమారి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు జలాశయంలోకి పడిపోయింది. ఈత రానందున నీటిలోనే ప్రాణాలు విడిచింది. అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పాండురంగారావు తెలిపారు.