'పుట్టింటివారు పసుపు కుంకుమ కింద ఇచ్చిన పొలాన్ని మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆక్రమించారు. న్యాయం చేయాలని కోరుతూ గత పదిహేనేళ్లుగా కార్యాలయాలచుట్టూ తిరుగుతున్నా. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్లే ఇలా చేస్తే ఇక మాకు ఎవరు న్యాయం చేస్తారు. నా పొలం లాక్కొని మంత్రి నాపైనే మర్డర్ కేసు పెడతానంటున్నారు. ఆయన మంత్రి అయితే ఎవరికి గొప్ప. నా కడుపు మండిపోతుంది' అని ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామానికి చెందిన కేసరి రంగలక్ష్మమ్మ మరోసారి కన్నీటి పర్యంతమయ్యారు.
మంత్రి సురేశ్ తన భూమిని కబ్జా చేశారని ఈనెల 9న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన రంగలక్ష్మమ్మ మార్కాపురంలో ఇవాళ నిర్వహించిన ప్రత్యేక స్పందన కార్యక్రమంలో మరోసారి ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఆవేదనను అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. 'ఇదివరకే ఫిర్యాదు చేశారు కదా.. మళ్ళీ ఇక్కడకు ఎందుకొచ్చారు' అని ఆమెను అధికారులు ప్రశ్నించారు. అధికారులతో మాట్లాడుతుండగానే అక్కడి నుంచి పోలీసులు పంపించేశారు.