GUNDLAKAMMA PROJECT :ప్రకాశం జిల్లాలోని మద్దిపాడు వద్ద ఉన్న గుండ్లకమ్మ జలాశయం మూడో గేటు దెబ్బతింది. గేటు కింది భాగంలో ఉన్న రెండు అరలు దెబ్బతిని, నీళ్లు భారీగా కిందికి పోతున్నాయి. లీకేజీని బుధవారం రాత్రి 9 గంటల తర్వాత సిబ్బంది గుర్తించి, ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. నిపుణులు, సిబ్బంది రంగంలోకి దిగి చర్యలు చేపడుతున్నా నీటి వృథాను నియంత్రించలేకపోతున్నారు. గురువారం రాత్రికి జలాశయం నుంచి సుమారు టీఎంసీ జలాలు సముద్రం పాలయ్యాయి. ఇన్‌ఫ్లో ఎక్కువ కావడంతో గేటు ఎత్తి నీళ్లు వదులుతున్నట్లు చెప్పి సమస్యను కప్పిపుచ్చేందుకు తొలుత అధికారులు యత్నించారు. మరోవైపు 6, 7, 12 గేట్ల నుంచి కూడా నీరు లీకవుతుంది.
చేతులెత్తేసిన ప్రైవేట్ సిబ్బంది
పీడబ్ల్యూ వర్క్‌షాప్ సిబ్బంది లేకపోవడంతో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నరసాపురం నుంచి ప్రైవేటు గుత్తేదారును పిలిపించారు. మూడో గేటుకు ముందువైపు స్టాప్ లాక్స్‌తో ప్రవాహాన్ని అరికట్టడానికి పనులు చేపట్టారు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అవి కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడి, వారూ చేతులెత్తేశారు. స్టాప్ లాక్స్‌ను ఒక్కొక్కటిగా కిందికి దించేందుకు ఉపయోగించే మోటర్ల వైర్లను ఎలుకలు కొరికేయడంతో సాయంత్రం 6.30 గంటలకు పనులు నిలిపేశారు.
తర్వాత వెలిగొండ ప్రాజెక్టు నిపుణులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి సిబ్బందిని పిలిపించారు. మూడో గేటును కిందికి దించితే పైన ఏర్పడే ఖాళీ ద్వారా ఎక్కువ నీళ్లు పోయే ప్రమాదం ఉందని, ప్రత్యామ్నాయంగా ఏం చేయాలన్నదానిపై చర్చిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే జలాశయంలో నీళ్లు మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు అంతంతమాత్రంగా ఉన్న సమయంలో నీళ్లన్నీ ఇలా వృథాగా పోవడంతో ఖరీఫ్, రబీ పంటలకు ఇబ్బందులు తప్పవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పై నుంచి వరద రాకపోయినా గేటు దెబ్బతిందని.. ఎగువ నుంచి వరద వచ్చి ఉంటే ఏకంగా గేట్లు కొట్టుకుపోయి దిగువన ఉన్న నాలుగు గ్రామాలు మునిగిపోయి ఉండేవని స్థానికులు చెబుతున్నారు.
జూన్‌లో రూ.89 లక్షలకు పాలనామోదం
గుండ్లకమ్మకు ఇటీవల బదిలీపై వచ్చిన చీఫ్ ఇంజినీర్ మురళీనాథ్‌రెడ్డి ప్రాజెక్టు స్థితిగతులపై పరిశీలన జరిపారు. మొదట అత్యవసరంగా 6, 7 నంబరు గేట్లు బాగు చేయాల్సి ఉందని, ఇందుకు రూ.89 లక్షలు అవసరమవుతాయని నాలుగు నెలల క్రితం ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు పంపారు. జూన్ నెలలో ప్రభుత్వం పాలనామోదం ఇచ్చింది. టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఈలోగా వర్షాలు, వరదలు రావడంతో ఆ మరమ్మతు పనులు కూడా ప్రారంభం కాలేదు. తాజాగా దెబ్బతిన్న మూడో నంబరు గేటు మరమ్మతులకు సైతం ఏడాది క్రితమే ప్రతిపాదనలు వెళ్లినా నిధులు రాలేదు.