ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ జిల్లా నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే లారీల అడ్డగింత..!

ప్రకాశం జిల్లా నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే కంటైనర్లపై కొందరు జులుం ప్రదర్శిస్తున్నారని లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. అక్రమ వసూళ్ల కోసం తమను ఇబ్బంది పెడుతున్నారని వాపోతున్నారు. కమిషన్‌ ఇవ్వకుంటే వాహనాలను రానివ్వమంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Krishnapatnam port
వాహనాలు అడ్డగింత

By

Published : Aug 27, 2021, 3:53 PM IST

కృష్ణపట్నం పోర్టుకు ప్రకాశం జిల్లా నుంచి వెళ్లే వాహనాలు అడ్డగింత

ప్రకాశం జిల్లా నుంచి గ్రానైట్‌, పొగాకు ఎగుమతులు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు ద్వారా జరుగుతాయి. మద్దిపాడు ఎస్ఈజెడ్ నుంచి గ్రానైట్‌ పలకలు, టొబాకో బోర్డు నుంచి బేళ్లు పక్కా రికార్డులతో ప్రతిరోజూ పోర్టుకు వెళ్తుంటాయి. కంపెనీలతో ఒప్పందం ప్రకారం నెలకు 3వేల ట్రిప్పులు తిరుగుతాయి. వందల మంది లారీ డ్రైవర్లు, క్లీనర్లకు ఇదే జీవనాధారం. ఒంగోలులో కంటైనర్ల లారీ యూనియన్‌ కూడా ఉంది. కొద్ది రోజుల నుంచి కృష్ణపట్నం పోర్టుకు వచ్చే వాహనాలను... తమ యూనియన్‌ పరిధిలోకి తేవాలంటూ కొందరు ఒత్తిడి తెస్తున్నారని లారీ యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న అద్దెలను పెంచి... కమీషన్లు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనియన్‌లోకి రాకపోతే లారీలను ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు.

ఎస్ఈజెడ్​లోని పరిశ్రమల యజమానులతో తమకు ఒప్పందాలు ఉన్నాయని లారీ యజమానులు చెబుతున్నారు. కొత్త యూనియన్‌లో చేరితే ఎన్నో ఇబ్బందులు పడతామని... కంపెనీల నుంచి రావలసిన బకాయిలు రాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఈజెడ్ నుంచి వెళ్లే ప్రతీ కంటైనర్‌కు అనుమతి ఉన్నా... పోలీసులు లారీలను స్టేషన్‌కు తీసుకెళ్తున్నారని చెబుతున్నారు. 15 రోజుల నుంచి ఈ తరహా దందా పెరిగిందని... మంత్రులు, అధికారులకు చెప్పినా స్పందన లేదని ఆరోపిస్తున్నారు. కొత్త దందా వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని... ప్రశాంతంగా సాగుతున్న తమ ఉపాధి అల్లకల్లోలం అవుతుందని లారీ యజమానులు వాపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి

యూనియన్ల మధ్య పోరు.. నిలిపి వేస్తున్న వాహనాలు...

ABOUT THE AUTHOR

...view details