దొనకొండ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. రాష్ట్ర రాజధానిగా ఎంపికవుతుందని ప్రచారం జరిగినా... చివరకు అమరావతిని నిర్ణయించడంతో తెరమరుగైంది. గత ప్రభుత్వ హయాంలోనే పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడంతో వార్తల్లో నిలిచి తదుపరి చర్యల్లో పురోగతి లేకపోవడంతో మరుగునపడింది. ప్రస్తుతం నేవీ, డిఫెన్స్ కేంద్రాల ఏర్పాటు, సోలార్ ప్రాజెక్టుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుండటంతో ఈ సారైనా అభివృద్ధికి పూర్తిస్థాయి అడుగులు పడతాయా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. గత పదిహేను రోజులుగా పలు కంపెనీల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు వచ్చి భూములు పరిశీలన చేస్తుండటంతో అంతటా చర్చ నడుస్తోంది.
అయిదేళ్లు... ఎన్నో ప్రతిపాదనలు...
దొనకొండ మండలంలోని 21 గ్రామాల్లో భూములను 2015లో అప్పటి ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా సర్వే చేయించింది. 2016లో దాదాపు 25,100 ఎకరాలతో పారిశ్రామిక కారిడార్‌కు కేటాయించారు. అప్పట్లో ఉక్రెయిన్, సికింద్రాబాద్‌కు చెందిన ఏవియేషన్ సంస్థలు సంయుక్తంగా ఇక్కడ యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్ల మరమ్మతులు, పైలెట్ శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. వీటికి తోడు 2018లో పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ఇండ్లచెరువు, రాగమక్కపల్లె, రుద్రసముద్రం, భూమనపల్లి గ్రామాల్లోని 2,550 ఎకరాలను ప్రభుత్వం ఏపీఐఐసీకి అప్పగించింది. రాగమక్కపల్లి సమీపంలో 43.79 ఎకరాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు కొన్ని పనులు జరిగినా అక్కడితో ఆగిపోయాయి.