Chandrababu Naidu: 'తిక్కశంకరయ్య వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించి.. బంగాళాఖాతంలో కలిపేయాలి' Chandrababu naidu meeting in Markapuram: ప్రకాశం జిల్లాలో ఇదేంఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు మార్కాపురంలో.. పర్యటించారు. పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. షెడ్యూల్ కన్నా ఆలస్యంగా రోడ్ షో జరిగినా ప్రజలు చంద్రబాబుకోసం వేచి చూశారు. రోడ్‌షోతో,.. ప్రధాన రహదారి పసుపుమయమైంది.
ప్రజలు రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలు ఎక్కారు. డివైడర్లపై నిలుచుని..చంద్రబాబును ఫొటోలు తీసుకున్నారు. చంద్రబాబు వాహనంపై నుంచి విజయసంకేతం చూపుతూ సాగగా ప్రజలు ఉత్సాహంగా ప్రతిస్పందించారు. కొందరు మహిళలైతే.. రోడ్డుపైనే ఉండి చంద్రబాబుకు హారతులు పట్టారు. ఇక కార్యకర్తలైతే.. పసుపు జెండాలు చేతబూని కేరింతలు కొడుతూ.. రోడ్ షోను జయప్రదం చేశారు.
మార్కాపురంలోని.. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి కళాశాల ఆవరణ వరకూ రోడ్ షో జన సంద్రాన్ని తలపించింది. ఈ సందర్భంగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు.. ఉద్వేగంగా ప్రసంగించారు. రాష్ట్రాన్ని బాగుచేసుకోవాలనే తపన ప్రతిఒక్కరిలో కనిపిస్తోందని అన్నారు. జగన్ చేతగానితనం వల్ల.. పొరుగు రాష్ట్రాలకు చులకనైపోయామని.. ఆవేదన వ్యక్తంచేశారు. జగన్‌ను ప్రజలు ఎందుకు నమ్మాలని.. చంద్రబాబు నిలదీశారు. విద్యుత్,ఆర్టీసీ ఛార్జీలు పెంచేసిన జగన్ పన్నులతో ప్రజల జీవనప్రమాణాలను దెబ్బతీశారని.. విమర్శించారు.
"హరీశ్ రావు ఒక మాట అన్నాడు. ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణకి.. భూమికి, ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది అనే పరిస్థితికి వచ్చాడు. అదే నేను ముఖ్కమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా అలా అన్నారా అని.. మిమ్మల్ని అడుగుతున్నాను. అన్ని రంగాల్లో నెంబర్ వన్ అవునా కాదా అని అడుగుతున్నా. ఎందుకు మనకు ఈ దరిద్రం పట్టింది అని అడుగుతున్నా. ఏంటీ ఖర్మ అని అడుగుతున్నా. బాధ, ఆవేదనతో చెప్తున్నా.. ఎగతాళి చేస్తున్నారు బయట. రాజధాని పెట్టుకోలేని మీరా మమ్మల్ని గురించి మాట్లాడతారా అని అడుగుతున్నారు. ఇప్పుడు అంటున్నాడు ఈ తిక్క శంకరయ్య మళ్లీ.. సెప్టెంబర్‌లో నేరుగా విశాఖపట్నం వెళ్లిపోతాడు అంట. నువ్వు పోవాల్సింది విశాఖపట్నం కాదు.. ఇడుపలపాయకి పంపించాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి". - చంద్రబాబు, టీడీపీ అధినేత
వెలిగొండ ప్రాజెక్టు 95 శాతం తెలుగుదేశం హయాంలోనే పూర్తైందని.. జగన్ మిగతా 5 శాతం పూర్తి చేయలేకపోయారని.. చంద్రబాబు దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే మార్కాపురాన్ని.. జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారు.రాత్రికి మార్కాపురంలోనే బసచేసిన చంద్రబాబు.. ఇవాళ యర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటిస్తారు.
"జగనే మీ నమ్మకం అంట.. బాబాయిని చంపి వేరే వాళ్లపైన పెట్టిన వాడిపై మీకు నమ్మకమా అని అడుగుతున్నా. కోడికత్తి డ్రామా అడిన వాళ్ల పై మీకు నమ్మకమా అని అడుగుతున్నా. దిల్లీకి వెళ్తాడు.. ప్రత్యేక హోదా అడిగాడా, రైల్వేజోన్ అడిగాడా, పోలవరం సమస్య మాట్లాడాడా.. దేనికి పోతున్నాడు. వాళ్ల తమ్ముడిని జైలుకి పోకుండా కాపాడుకోడానికి, ఇంకా ఆయన కేసులు ఉన్నాయి. కేంద్ర మెడలు వంచుతా అని చెప్పి.. మెడ దించాడా లేదా అని అడుగుతున్నా". - చంద్రబాబు, టీడీపీ అధినేత
ఇవీ చదవండి: