జన శిక్షణ.. మహిళల ఉపాధికి రక్షణ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగంగుంట గ్రామంలో జన శిక్షణ సంస్థాన్ ఆధ్వర్యంలో గ్రామీణ మహిళలకు కుట్లు, అల్లికలపై శిక్షణ ఇస్తున్నారు. ప్రతి మహిళను ప్రగతి పథంలో నడిపించేందుకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. టైలరింగ్, ఫ్యాషన్ డిజైనర్, బ్యూటీ పార్లర్, ఎంబ్రాయిడరీ కోర్సులతో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. గ్రామానికి చెందిన 60 మంది మహిళలు ఒక గ్రూపుగా ఏర్పడి ఇక్కడ శిక్షణ తీసుకుంటున్నారు.
ప్లాస్టిక్ నిర్మూలనే ధ్యేయం
ప్లాస్టిక్ నిర్మూలించాలనే సంకల్పంతో కాగితాలు, జూట్, పలు రకాల నార్లతో సంచుల తయారీలో వీరికి శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్తు తరానికి ప్లాస్టిక్ వాడటం వలన జరిగే నష్టాలను తెలియజేస్తూ పలు ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారు. గ్రూపుగా ఏర్పడి ప్లాస్టిక్ రహిత సంచులు తయారు చేస్తూ... స్వయంగా మార్కెట్లకు విక్రయిస్తున్నారు.
పెరుగుతున్న ఆసక్తి
గ్రామంలోని శ్రీ శక్తి భవనంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మహిళలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. 20 మందితో ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమం ప్రస్తుతం 60 మందికి చేరుకుంది. వీరిని రెండు బృందాలుగా విడదీసి... ఫ్యాబ్రిక్ పెయింటింగ్, టైలరింగ్, బ్యూటిషన్, ప్లాస్టిక్ రహిత సంచుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తైన మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాలు అందిస్తారు.
ఇదీ చదవండి :పోలవరంలో గోదావరి ఉద్ధృతి.. స్పిల్వే వైపు భారీ వరద