ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Prakasam: కొవిడ్​.. ఆ తర్వాత... పెరుగుతున్న సమస్యలు... - Ong_After Covid_Eenadu

కరోనా నుంచి కోలుకున్న కొంతమందిలో కొవిడ్ అనంతర సమస్యలు అధికంగా ఉంటున్నాయి. వారు మళ్లీ ఇప్పుడు ఆసుపత్రుల బాట పడుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నప్పటికీ ఈ తరహా బాధితులు ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Covid
కొవిడ్

By

Published : Jul 2, 2021, 6:41 PM IST

ప్రకాశం జిల్లాలో కొవిడ్‌ ఎన్నో కుటుంబాలపై ప్రభావం చూపింది. మహమ్మారితో ఆసుపత్రుల్లో చేరి జయించినవారు కొందరైతే.. స్వల్ప లక్షణాలు ఉండి సమయానికి మందులు, సరైన ఆహారం తీసుకుని కోలుకున్నవారు ఇంకొందరు. కొంతమందిలో కరోనా అనంతర సమస్యలు అధికంగా ఉంటున్నాయి. వారు మళ్లీ ఇప్పుడు ఆసుపత్రుల బాట పడుతున్నారు. ప్రస్తుతం పాజిటివ్‌ కేసులు తగ్గుతున్నప్పటికీ ఈ తరహా బాధితులు ఎక్కువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

సరాసరి 300 వరకు

జిల్లాలో కొవిడ్‌ కేసులు కొన్నిరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. గతయేడాది మార్చి నుంచి ఈ గురువారం ఉదయం వరకు మొత్తం 1,21,564 మంది వైరస్‌ బారినపడ్డారు. ఇందులో 1,16,210 మంది కోలుకున్నారు. 4,435 మంది ఆసుపత్రులు, హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటివరకు 919 మంది కరోనాతో పోరాడి మరణించారు. జిల్లాలో మే 4న అత్యధికంగా 2 వేల కేసులు నమోదవగా ఇప్పుడు 300-400 మధ్య ఉంటున్నాయి.

అన్నీ ఫంగస్‌ కాదు

కొవిడ్‌ వచ్చి తగ్గినవారిలో కొందరు తమకు వచ్చే వివిధ సమస్యలను బ్లాక్‌ఫంగస్‌ అనుకుంటున్నారు. అన్నీ అవి కాదు. బ్లాక్‌ఫంగస్‌ కేసుల్లో ప్రధానంగా తలనొప్పి, కళ్లు ఎర్రబడటం, కళ్లలోంచి నీరుకారడం, పళ్ల నొప్పి, దవడ నుంచి ఒకవైపు చెంప మొత్తం నొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. అనుమానితులకు తొలుత ఈఎన్‌టీ, ఎండోస్కోపీ, దంత పరీక్షలతో పాటు అవసరమైతే సీటీస్కాన్‌ వంటివి నిర్వహిస్తాం. ఫంగస్‌ ఉందో లేదో నిర్ధారణ అయిన తర్వాత శస్త్రచికిత్సలు చేస్తున్నాం. లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యం పొందాలి. లేకుంటే వీటి ప్రభావం ఇతర అవయవాలపై పడి సమస్య జఠిలమవుతుంది.

- డాక్టర్‌ కిరణ్‌కుమార్‌, బ్లాక్‌ఫంగస్‌ విభాగం నోడల్‌ అధికారి, జీజీహెచ్‌

వివిధ లక్షణాలతో

మే 18 నుంచి ఇప్పటివరకు బ్లాక్‌ఫంగస్‌ బాధితులు జిల్లాలో 170 మంది వరకు ఉన్నారు. వీరిలో 70 మంది జీజీహెచ్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. 50 మంది కోలుకోగా 16 మంది చనిపోయారు. మిగిలినవారు వివిధ కారణాలు, మెరుగైన వైద్యం కోసం గుంటూరు, హైదరాబాద్‌, చెన్నై ఆస్పత్రుల్లో చేరారు. కరోనా వచ్చి కోలుకున్నవారిలో చాలామందికి తలనొప్పి, కళ్ల మంటలు.. అరికాళ్లు, అరిచేతుల మంట, తీవ్ర నీరసం, కండరాల నొప్పులు, గుండె దడ, శ్వాస సంబంధిత ఇబ్బందులు, బరువులు ఎత్తలేకపోవడం, నిద్రలేమి తదితర సమస్యలు తలెత్తుతున్నాయి. పలువురు ఆసుపత్రులకు వెళ్తున్నారు. కొవిడ్‌ వచ్చి తగ్గిన విషయాన్ని వైద్యులకు చెప్పకుండా సమస్యను చెప్పి వైద్యం పొందేవారూ ఉన్నారు. బ్లాక్‌ఫంగస్‌గా అనుమానం వస్తే అప్పుడు జీజీహెచ్‌, ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. జిల్లాలో ఒంగోలు జీజీహెచ్‌లో మాత్రమే దీనికి వైద్యం అందిస్తున్నారు. దీంతో నెల్లూరు, గుంటూరు నుంచి కూడా రోజుకు 20 మందికి పైగా పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలతో వస్తున్నారు. ఇందులో నాలుగైదు కేసులు బ్లాక్‌ ఫంగస్‌గా తేలుతున్నాయి.

ఇదీ చదవండి:కరోనా వాక్సిన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు: సోము వీర్రాజు

ABOUT THE AUTHOR

...view details