ప్రకాశం జిల్లా వెలిగండ్ల మండలం గన్నవరం గ్రామంలో ఉన్న పాలేటి వాగుపై గతంలో వంతెన నిర్మాణ పనులు చేపట్టి మధ్యలోనే నిలిపివేశారు అసంపూర్ణంగా ఉన్న వంతెన వల్ల చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో పాలేటి వాగు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇటీవల కురిసిన వర్షాలకు పాలేటి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఈ గ్రామాల ప్రజలకు బయటకు వెళ్లాలంటే వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. ఉద్ధృతంగా వాగు దాటేందుకు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కనీస అవసరాలకు కూడా గ్రామం దాటలేని పరిస్థితి ఉందని గ్రామస్థులు వాపోతున్నారు.
వంతెన సమీపములో గల గన్నవరం, చెన్నంపల్లి, గండ్లోపల్లి, నాగులవరం గ్రామాల ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. ఈ వంతెన మార్గంలోనే వీరి ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. చుట్టు పక్కల గ్రామాలకు ఈ వంతెన మార్గమే ముఖ్య రహదారి. ఆసుపత్రికి వెళ్లాలన్నా, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలన్నా, మరే ఇతర పనులకు వెళ్లాలన్నా ఈ వంతెన మార్గంలోని ప్రయాణిస్తుంటారు. కానీ వర్షం వచ్చిందంటే చాలు వారి వెన్నులో వణుకు పుడుతుంది. వర్షానికి వంతెన చుట్టూ ఉండే వాగులు, వంకలు పొంగి పొర్లుతాయి. ఈ క్రమంలో ఇళ్లకు చేరుకునేందుకు వాళ్లు పడే బాధలు వర్ణనాతీతం.