పాతపడిన టీవీలు, కంప్యూటర్లు, ఫ్రిడ్జ్‌లు, కుర్చీలు వంటి ప్లాస్టిక్ వస్తువులు బయట పారేస్తుంటాం. అవి భూమిలో కలవకపోవడం వల్ల పర్యావరణానికి సవాల్‌గా మారుతున్నాయి. అవే తన వ్యాపారానికి పెట్టుబడిగా మలచుకున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సురేశ్. స్థానికంగా లభించే ప్లాస్టిక్ వ్యర్థాలను చిరువ్యాపారుల వద్ద నుంచి సేకరించి వాటిని కరిగించి ప్లాస్టిక్ గుళికలు తయారు చేస్తున్నారు. వీటితో అందమైన ఫోటో ఫ్రేమ్‌లు తయారు చేసి ఆదాయాన్ని అర్జిస్తున్నారు.
ఆలోచన ఉండాలే కానీ... ఆదాయానికి మార్గాలెన్నో..! - success story
ఎందుకు పనికి రావనుకుని మూలన పడేసే వస్తువులతో ఆదాయాన్ని అర్జిస్తున్నాడు ఓ చిరు పారిశ్రామిక వేత్త. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి అందమైన ఫొటో ఫ్రేమ్‌లు తయారు చేస్తున్నారు. ఆలోచన ఉండాలే కానీ ఆదాయానికి మార్గాలేన్నో అని నిరూపిస్తున్నారు.
విదేశాల్లోనూ గిరాకీ..
గతంలో ఫొటో ఫ్రేమ్‌లు కలపతో తయారు చేసేవారు.. ఇలా చేయడం వల్ల కొంతకాలానికి చెట్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని భావించారు. ప్లాస్టిక్ ఫొటో ఫ్రేమ్‌లు తయారు చేసి చెన్నై వంటి పట్టణాలతోపాటు ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. వివిధ రకాల డిజైన్లు, పరిమాణాల్లో తయారు చేస్తున్నందున ఈ ఫ్రేమ్‌లకు మంచి గిరాకీ ఉంటోంది. దీనివలన తన వ్యాపారం అభివృద్ధిపథంలో నడుస్తుందంటున్నారు సురేశ్. ఈ వినూత్న విధానం వలన తనతో పాటు మరికొంత మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. మద్దిపాడు సెంటర్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫ్రేమ్‌లు తయారు చేసే రెండు యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇందులో 30 మంది వరకూ ఉపాధి పొందుతున్నారు. రెండు రకాలుగా పర్యావరణానికి మేలు కలిగిస్తూ పరిశ్రమ నిర్వహిస్తున్నారు. వ్యర్థాలతో లాభాలు పొందుతూ తోటి పారిశ్రామిక వేత్తలకు సురేష్‌ను ఆదర్శంగా నిలుస్తున్నారు.