Migration to Other States in Prakasam District: పశ్చిమ ప్రకాశంలోని.. కనిగిరి, ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల్లో.. పనులు లేక కుటుంబాలకు కుటుంబాలు వలస వెళ్తున్నాయి. ప్రతి గ్రామంలో.. 20 నుంచి 30 శాతం మంది తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ముంబయి, పుణె, దిల్లీ, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలకు వెళ్లి.. కూలీ పనులు చేసుకుంటూ జీవితాలు నెట్టుకొస్తున్నారు.
పశ్చిమ ప్రకాశం నుంచి దాదాపు 50 వేల కుటుంబాలు.. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లగా.. ఇందులో ఒక్క కనిగిరి నియోజకవర్గం నుంచే 15 వేల కుటుంబాలు ఉన్నాయి. పీసీ పల్లి మండలం అన్నపురెడ్డిపల్లిలో వంద కుటుంబాలు ఉండగా ఇందులో 50కి పైగా కుటుంబాలు.. తెలంగాణ, కర్ణాటక, వలస వెళ్లాయి. సగానికి సగం ఇళ్లు తాళాలతో కనిపిస్తున్నాయి. భూమి లేని, తక్కువగా ఉన్న వారు.. వ్యవసాయం గిట్టుబాటు కాక పట్టణాలు, నగరాల బాట పట్టారు. అక్కడే ఏదో ఒక పనిచేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. పండుగలకో, శుభకార్యాలకో మాత్రమే గ్రామానికి వచ్చి.. తిరిగి వెళ్తుంటారు. దీంతో అనేక ఇళ్ల దగ్గర కేవలం వృద్ధులే కనిపిస్తుంటారు.