ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కొత్తగా 21 పంచాయతీలు.. తొలిపోరుకు పోటాపోటి

మారుమూల ప్రాంతాల్లో ఉన్న తండాలను , ఆవాస ప్రాంతాలను ప్రభుత్వం ప్రత్యేక పంచాయతీగా విభజించింది. గతంలో ఇతర పంచాయతీల పర్యవేక్షణలో ఉండడం వల్ల అభివృద్ధకి నోచుకోని వాటి దశ మారనుంది. సమస్యల ఊబి లోంచి బయటపడనున్నాయి. ఆ గ్రామాలేవి.. వాటి కథేంటి.. చూద్దాం!

panchayath elections
జిల్లాలో కొత్తగా 21 గ్రామాలు .. తొలిపోరుకు పోటాపోటి

By

Published : Jan 30, 2021, 6:05 PM IST

అవన్నీ మారుమూల గ్రామాలు, అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిన ఆవాసాలు.. పరిపాలన అంటే ఏమిటో తెలియని పల్లెటూళ్లు. జిల్లాలో నూతన పంచాయతీలుగా ఉన్నతీకరించిన గిరిజన తండాల పరిస్థితి ఇది. స్థానిక పరిపాలన లేని కారణంగా ఇప్పటివరకు కనీస వసతులు కరవయ్యాయి. ఇప్పటి వరకు ఇతర పంచాయతీ పరిధిలో ఉండటంతో చాలాకాలం నుంచి నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధితో పాటు, సంక్షేమ పథకాల అమల్లోనూ అన్యాయం చోటుచేసుకుందన్న విమర్శలున్నాయి. 500కు పైగా జనాభా ఉండి, ఆవాస ప్రాంతాలుగా ఉన్న గిరిజన తండాలను గత ప్రభుత్వ హయాంలోనే ప్రత్యేక పంచాయతీలుగా విభజించారు. ఇన్ని రోజులు స్థానికంగా ప్రాతినిధ్యం లేకపోవడంతో కొన్ని సమస్యలు దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోలేదు. ప్రస్తుతం ఆయా గ్రామాలకు మంచి రోజులు రాబోతున్నాయి. జనాభా ఎక్కువ ఉండి పంచాయతీకి దూరంగా ఉన్న శివారు గ్రామాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తింపు ఇచ్చారు. దీంతో 2019 డిసెంబర్‌లో మరికొన్ని పంచాయతీలు ఏర్పడ్డాయి. వాటన్నింటికి మొదటిసారి ఇప్పుడు సర్పంచి ఎన్నికలు నిర్వహించనున్నారు.
కొత్తవి ఏర్పడిందిలా..
2019 ఫిబ్రవరిలో తెదేపా ప్రభుత్వం 500 జనాభా పైబడి దూరంగా ఉన్న గిరిజన తండాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లాలో నూతనంగా పది గిరిజన తండా పంచాయతీలు ఏర్పడ్డాయి. 2019 డిసెంబర్‌లో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దూరంగా ఉన్న శివారు గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. తద్వారా మరికొన్ని కొత్తవి ఆవిర్భవించాయి.

పెద్ద వాటి పైనే అందరి దృష్టి..
జిల్లాలో మొత్తం 1,046 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో పది వేలకు పైగా ఓటర్లున్న పంచాయతీలు 13. ఇందులో ప్రస్తుతం 10 పంచాయతీల్లో ఎన్నికలు జరగుతున్నాయి. ఈపురుపాలెం(చీరాల), దేశాయిపేట, కొత్తపేట(వేటపాలెం) పంచాయతీలకు కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు నిలిపివేశారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్న పెద్ద పంచాయతీల్లో సర్పంచి పీఠాన్ని ఏ రాజకీయ పార్టీ మద్దతుదారులు గెలుచుకుంటారన్నదే అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. అక్కడ సర్పంచులు, వార్డు సభ్యుల అభ్యర్థుల ఎంపిక పైనా ప్రధాన పార్టీలైన వైకాపా, తెలుగుదేశం దృష్టి సారించాయి. ఆర్థిక, అంగ బలం ఉన్నవారిని గుర్తించే పనిలో పడ్డారు. ప్రధాన పార్టీల మద్దతుదారులతో పాటు, ఇతర స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలోనే పోటీకి దిగే అవకాశం ఉంది. దీంతో ఆయా పంచాయతీల్లో పోటా పోటీ వాతావరణంపై ఆసక్తి నెలకొంది.

ఈ గ్రామాల్లో ఓట్లు పదివేలకు పైనే


తొలిసారి ఎన్నికలు నిర్వహించేవి...
గుండువారి లక్ష్మీపురం(చీమకుర్తి), వజ్జిరెడ్డిపాలెం(కొత్తపట్నం), దాసరివారిపాలెం(నాగులుప్పలపాడు), బూరేపల్లి(మద్దిపాడు), బృందావనం తండా(ముండ్లమూరు), వేముల బండ(ముండ్లమూరు), రాళ్లపాడు(గుడ్లూరు), చట్టు తండా, కొర్రప్రోలు, చింతల(పెద్దదోర్నాల); దిగువమెట్ట తండా(గిద్దలూరు); దరిమడుగు, పడమటి పల్లె, తూర్పుపల్లె(మార్కాపురం), నారజముల్లా తండా, పెద్ద పీఆర్సీ తండా, గారపెంట, సుద్దకురవ తండా(పుల్లలచెరువు), సంగం తండా(త్రిపురాంతకం), పాలుట్ల తండా, కాశికుంట తండా(యర్రగొండపాలెం).చీరాల మండలం బోయినవారిపాలెం, సాయికాలనీలను కొత్త పంచాయతీలుగా ప్రకటించినా ప్రస్తుతం ఆ మండలంలో పంచాయతీల పునర్విభజనపై నెలకొన్న కోర్టు కేసు కారణంగా పల్లె పోరు తాత్కాలికంగా వాయిదా పడింది.

ఇదీ చదవండి:కోడ్ కూసినా... ముసుగు పడలేదు!

ABOUT THE AUTHOR

...view details