ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తొమ్మిదేళ్ల కుర్రాడు..ఆర్చరీలో ఆరితేరాడు !

బాహుబలి చిత్రంలో ప్రభాస్ విసిరే బాణాలను చూసి స్ఫూర్తి పొందిన ఓ తొమ్మిదేళ్ల  కుర్రాడు ఆర్చరీలో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. పిట్టకొంచెం...గురి ఘనం అన్నట్లు గురిచూసి కొడితే బంగారు పతకం ఖాయమే మరి! తల్లిదండ్రుల ప్రోత్సాహం, నిరంతర సాధనతో విలువిద్యలో జాతీయ స్థాయిలో అనేక పతకాలను కొల్లగొడుతూ...ఔరా అనిపిస్తున్నాడు.

తొమ్మిదేళ్ల కుర్రాడు..ఆర్చరీలో ఆరితేరాడు !

By

Published : Sep 20, 2019, 5:23 AM IST

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన బెల్లంకొండ రాహుల్​ ఓ ప్రయివేటు పాఠశాలలో ఐదవతరగతి చదువుతున్నాడు. తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కాగా...తండ్రి ఓ ప్రయివేటు సంస్థలో పనిచేస్తుంటాడు. బాహుబలి చిత్రంలో ప్రభాస్ ప్రత్యర్థులపై విసిరే బాణాలను చూసి స్ఫూర్తి పొందిన రాహుల్...తాను కుడా విలువిద్య నేర్చుకుంటానని తల్లిదండ్రులను కోరటంతో అందుకు అవసరమైన విల్లు, బాణాలను కొనిచ్చారు. దాంతో పాటు విజయవాడలో శిక్షణ కూడా ఇప్పించటంతో విలువిద్యలో నైపుణ్యం సాధించి ఎన్నో పతకాలను సాధించాడు.

తొమ్మిదేళ్ల కుర్రాడు..ఆర్చరీలో ఆరితేరాడు !

రాహుల్ తదేక దృష్టితో విసిరే బాణం గురితప్పకుండా లక్ష్యాన్ని ఛేదిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకూ...రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పతకాలను సాధించాడు. ఇటీవల విజయవాడ, గోవాల్లో జరిగిన మినీ జాతీయ ఆర్చరీ పోటీల్లో ఐదు బంగారు,కాంస్య పతకాలు సాధించాడు. 10 మీ, 15 మీ లక్ష్యాలను సునాయాశంగా ఛేదిస్తున్న రాహుల్...అండర్ 11 కేటగిరిలో త్వరలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం అవుతున్నాడు. భవిష్యత్తులో ఆసియా, ఒలంపిక్స్ గేమ్స్​లో భారత్ తరపున ఆడి రికార్డులు కొల్లగొడతానని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నాడు. నిరంతర కృషితోనే అనుకున్నది సాధించవచ్చని చెబుతూ...పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.

చదువుతో పాటు, తనకిష్టమైన రంగాన్ని ప్రోత్సహించటం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని రాహుల్ తల్లి రాజేశ్వరి స్పష్టం చేశారు. పిల్లల ఇష్టాలను గౌరవించటం వల్ల వారు ఎంచుకున్న రంగంలో గొప్ప విజయాలను సాధిస్తారని పేర్కొన్నారు.

ఇదీచదవండి

1996లో శిక్ష... 18 సంవత్సరాల తర్వాత ప్రత్యక్షం!

ABOUT THE AUTHOR

...view details