దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు.. జిల్లాల పునర్విభజన సెగ తగిలింది. మార్కాపురం జిల్లా సాధన సమితి నేతలు వెల్లంపల్లి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నాగార్జునరెడ్డితో కలిసి వెళ్తున్న మంత్రి వాహన శ్రేణిని.. ఆందోళనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పోలీసులు వారిని పక్కకు లాగారు. దీక్షా శిబిరాన్ని గమనించి కారు ఆపిన మంత్రి వెల్లంపల్లి.. జిల్లా సాధన సమితి నేతలతో మాట్లాడారు. 18 రోజులుగా ఉద్యమం చేస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, మార్కాపురం జిల్లా ఏర్పాటుకు మీరైనా సహకరించాలని మంత్రికి వినతిపత్రం అందించారు.
స్థానిక ప్రజల మనోభావాల్ని గుర్తించి.. మార్కాపురం జిల్లాను వెంటనే ఏర్పాటు చేయాలని తెలుగుదేశం నేత గూడూరి ఏరిక్షన్ బాబు డిమాండ్ చేశారు. లేకుంటే జిల్లాలో వైకాపా పార్టీకి పరాభావం తప్పదని హెచ్చరించారు. మార్కాపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో యర్రగొండపాలెంలో జరుగుతున్న రిలే దీక్షకు తెలుగుదేశం నేతలు సంఘీభావం తెలిపారు. ఎప్పటినుంచో ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షగా ఉన్న మార్కాపురం జిల్లాను ప్రభుత్వం ప్రకటించకపోవడం అన్యాయమన్నారు.