Formation of National Investment Preparation Council : ప్రకాశం జిల్లాలో పదేళ్ల క్రితం జాతీయ పెట్టుబడుల తయారీ మండలి ఏర్పాటుకు పచ్చ జెండా ఊపిన కేంద్రం.. ఇప్పటికీ ఆ ఊసే ఎత్తడం లేదు. అదిగో, ఇదిగో పరిశమలు అన్న మాటల తప్ప.. పరిశ్రమలు ఏర్పడింది లేదు.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందీ లేదు. పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయి అని ఆశలు పెట్టుకున్న యువత ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
2012లో కేంద్రం పచ్చజెండా : ప్రకాశం జిల్లాలో నిమ్జ్ ఏర్పాటుకు 2012లో కేంద్రం పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ప్రభుత్వం నిమ్జ్ ఏర్పాటుకు జిల్లాలో కనిగిరి ప్రాంతంలోని పామూరు, పిసిపల్లి మండలాల పరిధిలో మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసింది. ఇందులో భాగంగా 14,390 ఎకరాలను గుర్తించారు. బోదవాడలో 3405 ఎకరాలు, మాలకొండ పురంలో 3209 ఎకరాలు, రేణిమడుగులో 1025 ఎకరాలు, సిద్ధవరం 4390 ఎకరాలు, అయ్యన్నకోట 552 ఎకరాలు, పెద్ద ఇర్లపాడు 1647 ఎకరాలు భూములు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ, అసైన్డ్ భూములతో పాటు ప్రైవేటు సాగుభూములు ఉన్నాయి. ఈ భూములను సేకరించి ఆ మేరకు రైతులకు పరిహారం చెల్లించాల్సి ఉంది.
3.15లక్షల ఉద్యోగాల అంచనా : మూడు దశల్లో నిమ్జ్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా మొదటి విడతలో రూ.3,640 కోట్లతో 4149 ఎకరాల్లో పారిశ్రామికవాడను డెవలప్ చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3.15 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. అలాగే ఈ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందులో ఎలక్ట్రిక్ వాహనాలు, వాహన విడిభాగాలు, పీవీ పైపులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వుడ్, ఫార్మాటికల్స్, ఇంజినీరింగ్, లాజిస్టిక్స్, సోలార్ తదితర పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇక్కడికి అనువుగా వెలుగొండ జలాశయం గొట్టిపడే కాలువ నుంచి దాదాపు 1.2 టీఎంసీల నీటిని వినియోగించుకోనున్నారు.