ప్రజా సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించొద్దని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులకు సూచించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ఆయన నివాసంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ పరంగా రైతులు చాలా ఇబ్బందులకు గురౌతున్నారన్న మంత్రి... దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని స్పష్టం చేశారు.
దోర్నాల మండలంలో వర్షాల కారణంగా నష్టపోయిన రైతులు పెద్ద సంఖ్యలో మంత్రిని కలిశారు. వెలుగొండ ప్రాజెక్టు కాలువ తెగి... కడపరాజుపల్లిలోకి భారీగా వర్షపు నీరు వచ్చి పంటలు మునిగి నష్టపోయామని గోడు వెళ్లబోసుకున్నారు. సుమారు రూ.36 లక్షల మేర నష్టం జరిగిందని అధికారులు మంత్రికి చెప్పగా... సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు. తక్షణమే కాలువ మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.