నివర్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు డిసెంబరు చివరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారం అందించనుందని విద్యుత్, అటవీశాఖల మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. తుపాను వల్ల ప్రకాశం జిల్లాలో వాటిల్లిన నష్టాలపై ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో మంత్రి ఆదిమూలపు సురేశ్, అధికారులతో కలసి సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న పంటలను గుర్తించి, నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పక్షపాతం లేకుండా రైతులందరికీ మేలు జరిగేలా నష్టం అంచనాలను నమోదు చేయాలన్నారు. మరో రెండు తుఫాన్లు వస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అంటువ్యాధులు సోకకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.
నివర్ తుపాన్ విపత్తును గుర్తించి ముందస్తు ప్రణాళికతో ప్రాణ, ఆస్థి నష్టం జరగకుండా అధికారులు సమర్థంగా పనిచేయటం అభినందనీయమని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యనించారు. కొవిడ్ రెండవ ఉద్ధృతిపై ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించడానికి 50 రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మాస్క్, భౌతిక దూరం, చేతులు శుభ్ర పరచుకోవడంపై పత్యేక అవగాహన కల్పించాలన్నారు.