వందల్లో కొవిడ్ బాధితులు కోలుకునేలా చేసిన ఆ వైద్యుడు.. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీలో వైద్యుడిగా పని చేస్తున్న భాస్కరరావు కొవిడ్ చికిత్స కోసం ఏప్రిల్ 24న విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో చేరారు. క్రమంగా ఊపిరితిత్తుల పనితీరు బాగా క్షీణించింది. అక్కడ్నుంచి హైదరాబాద్‌కు తరలించారు. ఊపిరితిత్తులు మార్చాల్సిందేనని వైద్యులు చెప్పడంతో కిమ్స్‌కు మార్చారు. శస్త్రచికిత్సకు రూ.కోటిన్నర నుంచి కోటి 75లక్షల దాకా ఖర్చవుతుందని తెలుసుకుని.. కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Need help: ప్రాణాపాయ స్థితిలో డాక్టర్.. దాతల కోసం గ్రామస్థుల ఎదురుచూపు - prakasam district latest news
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అలుపెరగని పోరాటం చేస్తూ.. ఆఖరికి దాని గుప్పిటే చిక్కి ప్రాణాల కోసం పోరాడుతున్నారు ఓ వైద్యుడు. ఆయన త్వరగా కోలుకోవాలని గ్రామస్థులంతా ఒక్కటయ్యారు. ఖరీదైన వైద్యానికి తమవంతు సాయం అందిస్తున్నారు. ఇంకా డబ్బు కావాల్సి ఉండటంతో.. సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రాణపాయ స్థితిలో డాక్టర్ భాస్కరరావు
భాస్కరరావు సతీమణి భాగ్యలక్ష్మి సైతం వైద్యురాలే. వీరిద్దరూ కలిసి కారంచేడు, చీరాల, పర్చూరు, దగ్గుబాడు ప్రభుత్వాసుపత్రుల్లో సేవలందించి మంచిపేరు గడించారు. కారంచేడు గ్రామస్థులంతా చందాలు పోగేసి రూ.20 లక్షలు సేకరించి.. భాస్కరరావు వైద్య ఖర్చులకు అందించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. చికిత్సకు ఇంకా లక్షలు కావాల్సి ఉన్నందున.. ప్రభుత్వం, దాతలెవరైనా స్పందించి ఆదుకోవాలని భాస్కరరావు భార్య, కారంచేడు గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి