కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో నెలకు రెండుసార్లు కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తుండటం అక్రమార్కులకు వరంగా మారింది. ప్రజా పంపిణీ బియ్యం పక్కదారి పట్టింది. అంతేకాకుండా అధిక శాతం అక్రమ నిల్వలు కూడా బయటపడ్డాయి. శుక్రవారం జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ ఆదేశాల మేరకు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పోలీసులు, అధికారుల దాడులు జరిపారు.
అద్దంకిలో 6,250 బస్తాలు, దర్శిలో 1000 బస్తాలు, చీరాలలో రెండు రైస్ మిల్లుల్లో 580 బస్తాలు, యర్రగొండపాలెంలో 450, పొదిలిలో 124, మార్కాపురంలో 150 బస్తాలను పోలీసులు పట్టుకున్నారు. మార్టూరు మండలం వలపర్లలోని శివారులో ఒక రైస్ మిల్లుపై పోలీసులు దాడులు చేశారు. లారీలో తరలించటానికి సిద్ధంగా ఉన్న 600 బస్తాలు, మిల్లులో మరో 1400 బస్తాల రేషన్ బియ్యాన్ని చీరాల ట్రైనీ డీఎస్పీ స్రవంతి రాయ్, ఇంకొల్లు సీఐ అల్తాఫ్ హుస్సేన్లు పట్టుకున్నారు. వీటిని జిల్లా ఎస్పీ పరిశీలించారు.