HOME MINISTER CONSOLE: ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో రేపల్లె అత్యాచార బాధితురాలిని హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. రాష్ట్రంలో దిశ చట్టం అమలు కానందువల్ల ఆకతాయిలకు భయం లేకనే అఘాయిత్యాలు జరుగుతున్నాయని....హోంమంత్రి తానేటి వనిత అన్నారు. బిల్లును కేంద్రం ఆమోదించకపోవడమే ఇందుకు కారణమని ఉద్ఘాటించారు. రేపల్లె అత్యాచార బాధితురాలిని మంత్రి సురేష్, మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మతో కలిసి పరామర్శించారు. బాధితురాలిని పరామర్శించడానికి వెళ్లిన హోంమంత్రి కాన్వాయ్‌ను ఒంగోలు రిమ్స్ వద్ద తెదేపా శ్రేణులు అడ్డుకున్నారు.
"బాధితురాలు జుట్టు పట్టుకుని పక్కకు ఈడ్చుకుని వెళ్లి హింసించారు... ఇతరుల సాయం కోసం భర్త అందరినీ ప్రాధేయపడ్డారు. ఎవరూ స్పందించకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సమాచారం అందుకోగానే పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. రాత్రి ఒంటిగంటకు ఫిర్యాదు రాగానే.. ఉదయం 7 గంటలకు నిందితులను పట్టుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించాం. పోలీసులు వెళ్లడం ఆలస్యమైతే ఇంకా దారుణం జరిగేది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. నిందితులను వదిలిపెట్టేది లేదు.. కఠినంగా శిక్షిస్తాం. బాధితులకు రూ.8 లక్షలు ఆర్థికసాయం అందిస్తాం. ఇప్పటికే రూ.4 లక్షలు ఆర్థికసాయం అందించాం" -తానేటి వనిత, హోంమంత్రి