ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య ఏడాది పొడువునా ఉంటుంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం, సాగునీటి వనరులు లేకపోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా ఆయా గ్రామ జనాభాను బట్టి ట్యాంకర్లు కేటాయించి, ట్రిప్పులు కేటాయిస్తారు. గ్రామానికి దూరంగా డీప్ బోర్లు వేసి, అక్కడనుంచి నీటిని సరఫరా చేస్తారు. ఒకరోజు ఒక వీధిలో పంపిణీ చేస్తే, మరోరోజు మరో వీధికి నీటిని సరఫరా చేస్తారు. ప్రజలు డ్రమ్ముల్లో నీటిని పట్టుకుని భద్రపరుచుకుంటారు. అవే నీళ్లు ఇంటి అవసరాలకు, తాగేందుకు, పశువులకు వినియోగించుకుంటారు. ఒకరోజు ట్యాంకర్ రాకపోయినా ప్రజల నీటికష్టాలు అన్నీఇన్నీ కావు.
ఇలా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ ఆయా గ్రామాల్లో ట్రాక్టర్లను గుర్తించి ఈ బాధ్యత అప్పగిస్తారు. ఒకో ట్రిప్పునకు సుమారు 400 రూపాయలు చొప్పున చెల్లిస్తారు. ఇలా రోజుకు దాదాపు 10 ట్రిప్పుల నుంచి 15 ట్రిప్పుల వరకూ సరఫరా చేస్తారు. కొన్నేళ్లుగా నీటిని సరఫరా చేస్తున్న వారికి దాదాపు 2019 నుంచి బిల్లులు చెల్లింపులు జరపలేదని గుత్తేదారులు పేర్కొంటున్నారు.