Farmers Against To National Highway Land Acquisition : బెంగళూరు - అమరావతి జాతీయ రహదారి భూసేకరణపై రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మార్కెట్ ధర కంటే తక్కవ పరిహారం చెల్లిస్తామనడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ట్రాక్టర్లతో పంట పొలాల్ని ధ్వంసం చేస్తూ, రాళ్లు పాతడం దారుణమని.. ఉమ్మడి ప్రకాశం జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపాదిత బెంగళూరు - అమరావతి రహదారి.. రాష్ట్రంలో నెల్లూరు జిల్లా సరిహద్దు సీఎస్‌పురం నుంచి బాపట్ల జిల్లా మేదరమెట్ల వరకు నిర్మాణం జరగనుంది. ఈ రోడ్డుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 12 వందల 23 హెక్టార్ల భూమి అవసరం కానుంది. కనిగిరి, వెలగండ్ల, మర్రిపూడి, పొదిలి, తాళ్లూరు, చీమకుర్తి, అద్దంకి మండలాల మీదుగా నిర్మాణం చేపట్టనున్నారు. మధ్యమధ్యలో రింగ్‌రోడ్లు, పార్కింగ్ స్థలాల కోసం ఎక్కువ మొత్తంలో భూములు సేకరిస్తున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఐదుచోట్ల మాల్స్, హోటల్స్ కోసం 90 నుంచి 100 ఎకరాలు సేకరిస్తున్నారు. జాతీయ రహదారికి భూములు సేకరిస్తున్న అధికారులు... పరిహారం విషయంలో రైతులను మెప్పించలేకపోతున్నారు. మార్కెట్ ధర ఎకరా 60 లక్షల నుంచి 70 లక్షలు పలుకుతుంటే... పదకొండున్నర లక్షలతో సరిపెడతామంటే ఎలాగని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూసేకరణకు సంబంధించిన ప్రాథమిక సర్వేని హైవే అధికారులు ప్రారంభించారు. అందులో భాగంగా సరిహద్దు రాళ్లు కూడా పాతారు.