పోలవరం ఎత్తు ఒక్క మీటరు తగ్గించినా నిర్వాసితులు, రైతుల తరఫున తెదేపా పోరాటం చేస్తుందని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం నియమాలకు విరుద్ధంగా నాలుగున్నర మీటర్లకుపైగా పోలవరం ఎత్తు తగ్గించేందుకు సిద్ధమైందని ఆరోపించారు. 45.72 మీటర్ల మేర 150 అడుగుల్లో నిర్మాణం చేపట్టి 194 టీఎంసీల నీటిని నిలబెట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. నిర్వాసితులకు రూ.27,500కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఏడు దశాబ్దాలుగా 5 శాతం మాత్రమే పోలవరం పనులు జరిగితే.. తేదేపా 5 ఏళ్ల పాలనలో 70 శాతం పనులు పూర్తి చేసిందని ఏలూరి గుర్తు చేశారు. మిగిలిన 27శాతం పనులు పూర్తి చేయలేక వైకాపా ప్రభుత్వం ఆపసోపాలు పడుతోందని విమర్శించారు. కేసుల మాఫీ, స్వప్రయోజనాల కోసం పోలవరాన్ని నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.