ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రెవెన్యూ అధికారులపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు మండలంలో పర్యటించిన మంత్రి.. గ్రామ సచివాలయ భవనానికి శంఖుస్థాపన చేయాల్సి ఉంది. సచివాలయ స్థలం గ్రామానికి కిలో మీటరు దూరంలో ఉన్న కారణంగా గ్రామస్థులు అభ్యంతరం చెప్పారు.
స్పందించిన మంత్రి తహసీల్దార్, డీటీ లను పిలిచారు. వారు అక్కడ లేని కారణంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీఓ శేషిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. తహసీల్దార్ చంద్రావతి, డిప్యూటీ తహసీల్దార్ కలీల్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక తహసీల్దార్ సచివాలయానికి మంచి స్థలం చూడలేక పోతే తహసీల్దార్ ఉద్యోగానికి అనర్హులే అన్నారు. ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండేలా మరోచోట భూమిని చూడాలని ఆర్డీఓను ఆదేశించారు.