Water problems: నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో... తాగునీటి సమస్య తీర్చే దిశగా గత ప్రభుత్వం అడుగులువేసింది. నల్లమలసాగర్‌లో వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వెలిగొండ సొరంగాల నుంచి నల్లమల సాగర్‌కు నేరుగా చేరే జలాలను... గొట్టిపడియ వద్ద వాటర్ గ్రిడ్ నిర్మించి నిల్వచేసేలా ప్రణాళిక రూపొందించారు. అనంతరం పైపులైన్ల ద్వారా మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, కొండపి, కందుకూరు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసే ఉప గ్రిడ్‌లకు సరఫరా చేస్తారు. వాటి నుంచి ఆయా నియోజకవర్గాల పరిధిలోని మొత్తం 16 వందల 97 గ్రామాలకు... ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసి... తాగునీరందించాలన్నది లక్ష్యం. ఇంతవరకు బాగానే ఉన్నా... ఈ ప్రణాళిక ఆచరణలోకి రాకముందే..ప్రభుత్వం మారింది. నిర్మాణ పనుల్లోనూ జాప్యం చోటు చేసుకుంది.
Water problems: వాటర్ గ్రిడ్ నిర్మాణ పనులను సుధాకర్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. 2021 ఆగస్టులో 45 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించినప్పటికీ.. తరువాత అంచనా 73 కోట్లకు చేరింది. గ్రిడ్ ఏర్పాటు చేసే చోట పెద్ద గొయ్యి తీశారు. బిల్లులు రాకపోవడంతో ఏడు నెలల పాటు పనులు నిలిచిపోయాయి. గత మూడు నెలలుగా మళ్లీ పనులు మొదలయ్యాయి. బిహార్, కోల్‌కతా, ఒడిశాకు చెందిన సుమారు 100 మంది కార్మికులు, సంస్థ సిబ్బంది నిర్మాణ పనుల్లో ఉన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా నీళ్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే సాగర్‌లోకి జలాలు వచ్చేలోగా గ్రిడ్ పూర్తికావాల్సి ఉంది. లేదంటే పనులకు ఆటంకం తప్పదు.
Water problems: ప్రస్తుతం గ్రిడ్ నిర్మాణం పునాది దశలోనే ఉంది. దాదాపు 70 మీటర్ల ఎత్తున గ్రిడ్ నిర్మాణం చేపట్టాలి. పర్యవేక్షణకు వీలుగా కొండకు అనుసంధానంగా మరో నిర్మాణం చేయాలి. భారీ మోటార్లతో గ్రిడ్ లోపలికి పైపులు ఏర్పాటుచేసి.. వాటి ద్వారా రోజుకు 295 మిలియన్ లీటర్ల నీటిని 7 నియోజకవర్గాలకు సరఫరా చేయాలి. ఇందుకు కనీసం ఏడాదైనా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. నిర్మాణ సంస్థ సిబ్బంది మాత్రం.. మరో 5 నెలల సమయం ఉన్నందున... ఆ లోగా పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారు.