ప్రకాశం జిల్లా ఒంగోలు జీజీహెచ్ ఆవరణలో మృతదేహం పడి ఉండటం వివాదాస్పదమైంది. కొండెపి నియోజకవర్గం బిట్రగుంటకు చెందిన విశ్రాంత గ్రామ సహాయకుడు(70)కి ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అదే రోజు చికిత్స కోసం జీజీహెచ్‌కు వచ్చాడు. అయితే సోమవారం సాయంత్రం ఆసుపత్రి ఆవరణలో ఆయన మృతదేహం ఉంది. దీనిని ఎలుకలు, కుక్కలు పీక్కు తినడాన్ని గుర్తించిన రోగులు... ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అనంతరం సిబ్బంది ఆ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
కొవిడ్ బాధితుడి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
ఒంగోలులో హృదయ విదారక ఘటన జరిగింది. జీజీహెచ్ ఆవరణలో కొవిడ్ బాధితుడి మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్నాయి. ఆసుపత్రికి వచ్చిన రోగులు ఫిర్యాదు చేస్తేగానీ జీజీహెచ్ సిబ్బంది.. మృతదేహాన్ని పట్టించుకోలేదు.
మంగళవారం అతని బంధువులు ఆస్పత్రికి రాగా విషయం తెలిసి నిర్ఘాంతపోయారు. ఈ సంఘటనపై కొండెపి ఎమ్మెల్యే డి.వి.బాల వీరాంజనేయ స్వామి ఆసుపత్రికి వెళ్లి వైద్యాధికారులను ప్రశ్నించారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీరాములు స్పందించారు. మృతుడు ఐసోలేషన్ వార్డులో అడ్మిట్ కాలేదని, ఓపీ వద్దకు వచ్చినట్లు రికార్డుల్లో లేవని చెప్పారు. ఓపీ తీసుకుని అడ్మిట్ అయితే చికిత్స అందించేవాళ్లమని అన్నారు. ఐదు రోజులుగా వృద్ధుడు ఆసుపత్రి ఆవరణలోనే తిరుగుతున్నాడా?.. లేదా వార్డు నుంచి బయటకు వచ్చి మృత్యువాత పడ్డాడా? అన్నది తేలాల్సి ఉంది.
ఈ సంఘటనపై చంద్రబాబు ట్విటర్ వేదికగా స్పందించారు. రెండ్రోజులుగా ఆస్పత్రి ఆవరణలో మృతదేహాన్ని అలానే వదిలేశారని విచారం వ్యక్తం చేశారు. ఆ మృతదేహాన్ని కుక్కలు పీక్కుని తింటున్నా పట్టించుకున్న వారే లేరని ఆక్షేపించారు. ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.