గత కొంత కాలంగా కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. అగ్రదేశాలకు ధీటుగా భారతదేశం కరోనా నియంత్రణ కొవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేసి నేడు ప్రజలకు అందిస్తోంది. ప్రకాశం జిల్లాలో 22 కేంద్రాలలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగింది. ఉదయం కలెక్టర్ కృష్ణ భాస్కర్ అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లాలో మొత్తం 24,000 మందికి టీకా ఇచ్చేందుకు గుర్తించామని.. అయితే తొలి రోజు 20 శాతం మంది దాదాపు 967 మందికే వాక్సిన్ ఇచ్చామని తెలిపారు.
ఒంగోలులో కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ప్రారంభించారు. జిల్లాలో మొదటి కొవిడ్ టీకా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు వేయించుకున్నారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గంలోని కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, వైద్యులు కొవిడ్ వ్యాక్సిన్ కేంద్రాల వద్ద వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.
చీరాలలో..
కరోనా వాక్సినేషన్ ప్రకాశం జిల్లా చీరాలలో ప్రారంభమైంది. చీరాల పట్టణం వైకుంఠపురంలోని ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. మొదటగా ఆరోగ్య కార్యకర్తకు వాక్సిన్ వేశారు. మొత్తం 15 మందికి తొలివిడత వాక్సిన్ వేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.
కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి వాక్సిన్ అందుబాటులోకి రావడం శుభపరిణామమని చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి అన్నారు. ముందుగా టీకా వేయించుకుని తామే ప్రజలకు ధైర్యం చెబుతున్నామని.. టీకా వేయించుకున్న ఆశా కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు.
అద్దంకిలో..
అద్దంకి నియోజకవర్గంలో కొరిసపాడు, అద్దంకి ప్రభుత్వ వైద్యశాలల్లో కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను చేపట్టారు. అద్దంకి వైద్యశాలలో వాక్సినేషన్ కార్యక్రమాన్ని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పరిశీలించారు. టీకా ఎవరికి వేయాలి.. టీకా వేసిన వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే పలు విషయాలను వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.