పెళ్లి పేరుతో మాట్రిమోనియల్ సైట్ ద్వారా అమ్మాయిలను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఓ సైబర్ నేరగాడిని జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతడికి అరదండాలు వేయడంతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంబంధిత వివరాలను ఎస్పీ మలికా గార్గ్ వెల్లడించారు.
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినంటూ...
మద్దిపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి తల్లిదండ్రులు వివాహం చేయాలని భావించారు. ఆమె వివరాలను ఓ మాట్రిమోనియల్ సైట్‌లో ఉంచారు. అదే సైట్‌లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని అశోక్‌నగర్‌కు చెందిన పొట్లూరి శ్రీబాల వంశీకృష్ణ అలియాస్ ప్రతాపనేని రాజేష్‌కుమార్ అనే వ్యక్తి ఈ నెల 16న యువతికి పరిచయమయ్యాడు. తాను అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాననీ, కొవిడ్ కారణంగా హైదరాబాద్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్టు నమ్మించాడు. యువతి కూడా విదేశాలకు వెళ్లే సన్నాహాల్లో ఉంది. అయితే సిబిల్ స్కోరు తక్కువగా ఉండటంతో ఆమెకు మాయమాటలు చెప్పాడు. హెచ్1బీ వీసా కోసమంటూ పలు ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా రూ. 17.49 లక్షల వరకు రుణాలు తీసుకునేలా చేశాడు. వాటిని తన ఖాతాకు మళ్లించుకుని స్వాహా చేశాడు. ఇదంతా కేవలం నాలుగు రోజుల్లోనే చేశాడు.
జూదాలు.. అనేక చిరునామాలు...
తాను మోసపోయినట్టు గ్రహించిన యువతి గత సోమవారం స్పందన ద్వారా ఎస్పీని ఆశ్రయించారు. కేవలం అయిదు రోజుల వ్యవధిలోనే పోలీసులు సైబర్ నేరగాడి ఆట కట్టించారు. నిందితుడు శ్రీబాల వంశీకృష్ణ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అశోక్‌నగర్ వాసిగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా బూర్గంపాడులోని వెంకటేశ్వర నగర్, విజయవాడలోని పోరంకి, వెంకటేశ్వర కాలనీ చిరునామాలతోనూ చెలామణి అవుతున్నట్టు తెలుసుకున్నారు. కాకినాడలో బీఫార్మసీ పూర్తి చేశాడు. తండ్రి మృతిచెందిన తర్వాత తల్లి మరో వ్యక్తిని వివాహమాడి వెళ్లిపోయారు. వంశీకృష్ణ ఆ తర్వాత ప్రైవేట్ బ్యాంకులు, షేర్ మార్కెట్ సంస్థల్లో పనిచేస్తూ ఓ యువతిని వివాహమాడాడు. బెంగళూరులో నివసిస్తున్న కాలంలో గుర్రపు పందేలు, జూదాలకు బానిసగా మారాడు. ఏటీఎం కేంద్రాల వద్దకు వచ్చే వారి దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడేవాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య అతనికి విడాకులిచ్చింది. వ్యసనాలకు బానిసైన వంశీకృష్ణ.. ప్రతాపనేని రాజేష్‌కుమార్ పేరిట మెయిల్ ఐడీ రూపొందించి మాట్రిమోనియల్ సైట్‌లో తన పేరు ఉంచి మోసాలకు తెర లేపాడు. ఈ తరహాలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎనిమిది మంది అమ్మాయిలను మోసగించినట్టు పోలీసులు తెలిపారు. అతని నుంచి రూ.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:భవనంపై నుంచి దూకి బాలిక ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే ?
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!