వరుసగా మూడేళ్లు మహానాడుకు భౌతికంగా దూరంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులు... ఈసారి పండుగను విజయవంతం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. మూడేళ్ల వైకాపా పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న తెలుగుదేశం..దానిని మహానాడు వేదికగా తమకు అనుకూలంగా మలచుకోవడంతో పాటు.. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని భావిస్తోంది.
మహానాడు నిర్వహణ పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్న తెలుగుదేశం..ప్రజాక్షేత్రంలో తమ సత్తా చాటేందుకు.. మహానాడు విజయవంతం చేయడాన్ని సవాలుగా తీసుకుంది. ఇందులో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు.... ఒకరోజు ముందుగానే నేడు ఒంగోలుకు బయల్దేరి వెళ్లనున్నారు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి అధినేత చంద్రబాబు వెంట భారీ ద్విచక్ర వాహనర్యాలీతో ఒంగోలు వెళ్లేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. చంద్రబాబు ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించిన దగ్గర నుంచి..భారీ ర్యాలీతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మహానాడు నిర్వహణకు మినీ స్టేడియం అడిగితే అనుమతులు నిరాకరించడం, వాహనాలు ఇవ్వొద్దంటూ ఆర్టీసీ సహా ప్రైవేట్ ట్రావెల్స్, విద్యాసంస్థలపై ప్రభుత్వం ఒత్తిడి తేవడం, ఒంగోలులో పసుపు తోరణాల తొలగింపు వంటి పరిణామాలను చంద్రబాబు సహా పార్టీ నాయకులు తీవ్రంగా పరిగణించారు. అమరావతి కేంద్రంగా నిర్వహించాలనుకున్న పొలిట్‌బ్యూరో సమావేశ వేదికను.. ఒంగోలుకు మార్చారు. మహానాడు ప్రారంభం రోజు మాత్రమే.. ఆ ప్రాంతానికి వచ్చే సంస్కృతికి స్వస్తి పలికి.. ఒక రోజు ముందే అక్కడ మకాం వేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా..తమ వెంట ప్రజాబలం ఉందని చాటేలా.. వ్యూహరచన చేసుకున్నారు.