మహా ప్రభంజనంలా తెలుగుదేశం మహానాడు tdp Mahanadu : మహా ప్రభంజనంలా తెలుగుదేశం మహానాడు తొలురోజు వేడుక మహోత్సవంలా ఘనంగా ప్రారంభమైంది. ఒంగోలు వీధులు ఎటు చూసినా పసుపు తోరణాలతో అతిథులకు స్వాగతం పలికాయి. ఉదయం ఆరుగంటల నుంచి ప్రాంగణానికి తండోపతండాలుగా పసుపు శ్రేణులు తరలివచ్చారు. ప్రతినిధుల నమోదు ప్రారంభం కాకముందే ముందవరుస కుర్చీలు నిండిపోయాయి. తొలిరోజు సమావేశానికి 12వేల మంది ప్రతినిధులు మాత్రమే వస్తారన్న పార్టీ అంచనాలకు మించి సభా ప్రాంగణం కిక్కిరిసింది. జాతీయ రహదారి నుంచి దాదాపు 500మీటర్లు దూరంగా మహానాడు ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినా.. సభా వేదిక నుంచి రహదారి వరకూ ఎక్కడ చూసినా కార్యకర్తలూ, శ్రేణులే కనిపించారు. రేపటి బహిరంగ సభకు 2లక్షలమంది వస్తారని పార్టీ అంచనా వేస్తుండగా.. తొలిరోజు కార్యక్రమంలోనే ఆ స్థాయి జోష్ ఉరకలెత్తింది. ప్రాంగణ పరిధిలో ఎక్కడ చూసినా కార్యకర్తలే గుంపులు గుంపులుగా కనిపించారు. చంద్రబాబు ప్రత్యేక భద్రతా సిబ్బంది, పోలీసులు, పార్టీ వాలంటీర్ వ్యవస్థ ఇవేవీ కార్యకర్తల ఉత్సాహానిని అడ్డుకట్టవేయలేకపోయాయి. చంద్రబాబు ప్రత్యేక వాహనంపైకి కూడా ఎక్కేసి మహానాడును వీక్షించేందుకు ఉవ్విళ్లూరారు. దీంతో ముఖ్యనాయకులు, నేతలకు సైతం మహానాడు స్టేజి ఎక్కేందుకు కష్టతరంగా మారింది.
వైకాపా ప్రభుత్వ పాలనపై చంద్రబాబు విమర్శలు Chandrababu Fires on YSRCP:ప్రారంభోత్సవ ఉపన్యాసంలో వైకాపా ప్రభుత్వ పాలనపై చంద్రబాబు విమర్శనాస్త్రాలతో విరుచుకుపడ్డారు. దళితుల్లో ప్రభుత్వంపట్ల వ్యతిరేకత వచ్చినందుకే అమలాపురంలో కులచిచ్చు రాజేశారని ఆరోపించారు. రూ. 8లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలో చేసిన అభివృద్ధి శూన్యమని ధ్వజమెత్తారు. తెలుగుదేశం ప్రభుత్వం 51శాతం నిధులు సంక్షేమానికి ఖర్చు చేస్తే... జగన్ రెడ్డి ఖర్చు చేసేది 41శాతం మాత్రమేనని విమర్శించారు. తెలుగుదేశం సంక్షేమ పథకాలన్నీ తీసేసి జగన్ మోసకారి సంక్షేమం అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా పన్నులు పెంచి.. ప్రజలను ఇబ్బందిపెట్టారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎవరైనా తప్పు తెలుసుకుంటే బాగుపడతారని.. చెప్పింది వినకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ, విద్యుత్.. ఒకటేమిటి అన్ని ఛార్జీలు పెంచారని.. నిత్యావసరాలు కొనే పరిస్థితి లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా పాలనలో ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేరని విమర్శించారు. రైతులకు మళ్లీ మంచి రోజులు వచ్చే పరిస్థితి రాబోతోందని.. ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని భరోసా ఇచ్చారు. అన్నదాతలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
మోటార్లకు మీటర్లతో.. రైతుకు ఉరేస్తున్నారు : చంద్రబాబు CBN on Meters to Motors:వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపుపై మహానాడు వేదికగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఎన్టీఆర్ వ్యవసాయ మోటర్లకు మీటర్లను తీసేస్తే.. ఇప్పుడు వైకాపా జగన్ మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరేసే పరిస్థితి తెచ్చారని ధ్వజమెత్తారు. మోటార్లకు మీటర్లు పెడితే భవిష్యత్తులో చాలా నష్టం వస్తుందని తెలిపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మోటర్లకు మీటర్లు పెట్టనివ్వబోమని తేల్చి చెప్పారు. రైతులు దీనిపై పోరాటానికి సిద్ధం కావాలని.. తెలుగుదేశం ఇందుకు పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతు భరోసా అంటూ ప్రభుత్వం మోసం చేస్తోందని.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో సర్కారు సాయమే అందడం లేదని ధ్వజమెత్తారు.
వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకే: చంద్రబాబు CBN on Youth:వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. సమర్థులైన యువతకు టిక్కెట్లిస్తామని స్పష్టంచేశారు. పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తానని తేల్చిచెప్పారు. రాష్ట్ర అభివృద్ది కోసం నూతన ఉత్సాహంతో ఉండే వ్యక్తులను ప్రోత్సహింద్దామన్నారు. ప్రజలతో కలిసి పనిచేయడం.. మీకు అండగా నేను అంటా. మీరే చేసే పనే మీరు శ్రీరామరక్షా. చేసే పనులకు బట్టి పార్టీలో మంచి ఉన్నత స్థానం కల్పిస్తామని చంద్రబాబు సూచించారు. తన కుటుంబ సభ్యులకు రుణపడి ఉన్నా లేకున్నా.. కార్యకర్తలకు మాత్రం ఎల్లప్పుడూ రుణపడి ఉన్నానని చంద్రబాబు అన్నారు. రూ.100 కోట్ల మేర ప్రిమీయంను కార్యకర్తలకు ఇప్పించామన్న చంద్రబాబు.. తెదేపా ప్రభుత్వంలో చేసిన నరేగా(ఉపాధి హమీ పథకం) పనులకు ఈ ప్రభుత్వం డబ్బులివ్వకుంటే 10 మంది అడ్వకేట్లను పెట్టి డబ్బులిప్పించామని గుర్తుచేశారు.
పోలవరం విశిష్టత జగన్కు తెలుసా?: అమరావతి ఏం పాపం చేసిందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పోలవరం విశిష్టత, డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాంల గురించి జగన్కు తెలుసా అని నిలదీశారు. 30 లక్షల ఇళ్లు కడతామని ఎన్నికల ముందు చెప్పి, కేవలం 3లక్షల ఇళ్లు మాత్రమే ఈ ప్రభుత్వం కట్టిందని దుయ్యబట్టారు. వచ్చే వర్షాకాలంలో రాష్ట్రంలో రహదారులపై చేపలి పట్టి, వరినాట్లు కూడా నాటొచ్చని ఎద్దేవా చేశారు. బాబాయ్ మరణం గుండెపోటుగాను, కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య రోడ్డు ప్రమాదగానూ మారిందని ధ్వజమెత్తారు. సుబ్రహ్మణ్యం హత్యను ప్రజలు తప్పుబట్టే సరికి కోనసీమలో చిచ్చుపెట్టారని మండిపడ్డారు. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్గా ఉన్నప్పుడు అంబేడ్కర్కి భారతరత్న వచ్చిందని గుర్తుచేశారు.
Chandrababu on ISB 20th Anniversary: నిన్న ఐఎస్బీ 20వ వార్షికోత్వంలో ప్రధాని మోదీ తన కృషిని గుర్తించకపోయినా... ఐఎస్బీని తీసుకురావటంలో తాను చేసిన కృషి ఎంతో తృప్తినిస్తుందని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఐఎస్బీ లాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని వందలు చేసిందని అన్నారు. ఎన్నో సంస్థలు, వందల కంపెనీలకు నాటి ఉమ్మడి ఏపీకి తీసుకొస్తే.. రైతు, రైతు కూలీలు కుటుంబాల్లోని పిల్లలు ఐటీ ద్వారా ఎంతో అభివృద్ధి చెందారన్నారు.
CBN Warning to CM Jagan:రాష్ట్రంలో ఉన్మాది పాలన ఏపీకి శాపంగా మారిందని ధ్వజమెత్తారు. దద్దమ్మ పాలన వల్ల రాష్ట్రం పరువు పోతోందని మండిపడ్డారు. కార్యకర్తలను అరెస్ట్ చేస్తే నిద్ర లేని రాత్రుళ్లు గడిపానన్న చంద్రబాబు.. కుటుంబ సభ్యులు ఇబ్బందుల్లో ఉంటే తనకెలా నిద్రపడుతుందన్నారు. పార్టీ కార్యకర్తలతో పాటు.. సాధారణ ప్రజలను ఇబ్బంది పడుతోన్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో అభివృద్ధి నాటకం.. సంక్షేమం బూటకమని విమర్శించారు. ఒక ఉన్మాది చేతుల్లో పోలీసులు బలి కాకూడదని సూచించారు. తప్పులు చేసిన అధికారులు, పోలీసులను వదిలి పెట్టేదే లేదని హెచ్చరించారు. గతంలో జగన్ వల్ల ఎంతో మంది జైళ్లకెళ్లారన్న చంద్రబాబు.. రాని కరెంటుకు బాదుడే బాదుడు పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచటమేంటని మండిపడ్డారు. అరాచక శక్తులు, అసాంఘీక శక్తులు.. కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్లో ఉత్సాహం తగ్గడం లేదన్నారు. గత మూడేళ్లు పార్టీ కార్యకర్తలు, నేతలు పడిన ఇబ్బందులను తలుచుకుంటే బాధేస్తోందని చంద్రబాబు అన్నారు.
ఇవీ చదవండి: