ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలంలోని చదలవాడ పశుఉత్పత్తి క్షేత్రంలో మొన్నటి వరకూ నిర్వహణ భారంగా ఉండేది. ఒంగోలు జాతి పశుగణాభివృద్ధికి, నాణ్యమైన కోడెదూడల ఉత్పత్తికి ఏర్పాటు చేసిన ఈ పశు క్షేత్రం.. లక్ష్యాలకు దూరంగా ఉండేది. సుమారు 190 ఎకరాల భూమి.. పశుఉత్పత్తి క్షేత్రం కింద ఉన్నా.. ఇక్కడి 200 పశువులకు గ్రాసం అందించలేని పరిస్థితి ఉండేది. అయితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఊపిరిపోసుకుని.. పశువుల వృద్ధిలో చక్కటి ఫలితాలు సాధిస్తోంది. విశాలమైన షెడ్లు, తాగునీటి సౌకర్యాల ఏర్పాటుతోపాటు సొంతంగా పశుగ్రాస క్షేత్రాలను అభివృద్ధి చేయటం ద్వారా అధికారులు.. లక్ష్యం దిశగా సాగుతున్నారు. ఈ ఏడాది 80 దూడల ఉత్పత్తి జరిగింది.
గతంలో పశువులను ఆరు బయటే కట్టేయడం వల్ల తరచూ అనారోగ్యం బారిన పడి ఆలస్యంగా ఎదకు రావడం, తక్కువ పాలివ్వడం జరిగేది. అయితే.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గోచార్ మిషన్‌లో భాగంగా సుమారు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయటంతో.. ఈ పశుఉత్పత్తి క్షేత్రం రూపురేఖలు మారిపోయాయి.