AP MLC Election Fightings In Four Districs: ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం, ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు, కడప- అనంతపురం-కర్నూలు పట్టభధ్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలు, ప్రకాశం-నెల్లూరు- చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు.., పశ్చిమ గోదావరిలో 2, శ్రీకాకుళం, కర్నూలు స్థానిక సంస్థల కోటా నియోజకవర్గాల్లో ఇవాళ జరిగిన పోలింగ్.. పలుచోట్ల ఉద్రిక్తతకు దారి తీసింది. సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలోని.. లింగాల పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా నాయకులు రెచ్చిపోయారు.
తీవ్రమైన ఘర్షణలు: పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి, ఎటువంటి ఘర్షణలు జరగకుండా పహారా కాశారు. కానీ, ప్రకాశం జిల్లా ఒంగోలులో, తిరుపతిలో, వైఎస్సార్ జిల్లాలోని పులివెందులలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ప్రకాశం జిల్లాలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ:ప్రకాశం జిల్లాఒంగోలులో జరిగిన మండలి ఎన్నికలు సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జీ చేశారు. ఒంగోలు శ్రీనివాస కాలనీలో ఉన్న సెయింట్ థెరీసా పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం కార్యకర్త ఒకరు.. వైసీపీ వాళ్లను చూసి సవాల్ విసిరానే కారణంగా వైసీపీ కార్యకర్తలు అతడిపై తీవ్రంగా దాడి చేశారు. పోలీసులు అతడిని అదుపులో తీసుకునేందుకు ప్రయత్నించగా అతడు ఓ కళ్యాణమండపంలో దాక్కున్నారు.
దీంతో ఎమ్మెల్యే బాలినేనికి సమాచారం ఇవ్వడంతో ఆయన పోలింగ్ కేంద్రానికి చేరుకొని తెలుగుదేశం కార్యకర్తను తనకు అప్పగించాలని పోలీసులకు పురమాయించారు. పోలీసులు పిలిచినా అతడు రాకపోయేసరికి పోలీసులను వెంటపెట్టుకొని బాలినేని, కార్యకర్తలు కళ్యాణమండపానికి చేరుకొని ఆ కార్యకర్తలపై దాడి చేశారు.. తెలుగుదేశం కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ అక్కడకు చేరుకొని పోలీసుల తీరును నిలదీశారు. ఇరుపార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ గొడవ కారణంగా మెయిన్ రోడ్డులో ట్రాఫిక్ స్తంభించింది... ఓటర్లుకు స్లిప్లు ఇచ్చే శిబిరాలు కూడా వైసీపీ, తెలుగుదేశ పార్టీలు పక్కపక్కనే ఉండటం వల్ల ఇరు పార్టీలు కార్యకర్తలు కేకలు వేసుకున్నారు.
కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉద్రిక్తత:ప్రకాశం జిల్లా కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగి.. ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు పోలింగ్ బూతులు వద్దకు వెళ్లి ఓట్లను ప్రభావితం చేస్తుండటంతో ప్రశ్నించేందుకు వచ్చిన కనిగిరి టీడీపీ ఇంచార్జ్ ఉగ్ర నరసింహ రెడ్డినీ పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాన గేటు వద్దనుంచే వెనక్కి వెళ్లాలని పోలీసులు హెచ్చరించడంతో.. వైసీపీ నాయకులకు పోలింగ్ బూతుల వద్ద వారికేం పని అని ప్రశ్నించారు. దీంతో వైసీపీ నాయకులు ఒక్కసారిగా టీడీపీ నాయకులపై విరుచుకుపడి వివాదానికి తీరతీశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఇరుపార్టీ నాయకులను చెదరకొట్టడంతో వివాదం సద్దుమణిగింది.