ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం న్యాయ పరిశీలనకు పంపించింది. ల్యాండ్ లార్డ్ విధానంలో రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం... టెండర్లను న్యాయ పరిశీలన ద్వారా సమీక్షించిన అనంతరం జారీ చేయాలని నిర్ణయించింది. పోర్టును అభివృద్ధి చేసేందుకు కాంట్రాక్టు విలువ 2169 కోట్ల రూపాయలుగా ప్రభుత్వం నిర్ధారించింది.
3 ఏళ్లలో మొదటి దశ
5.05 కిలోమీటర్ల బ్రేక్ వాటర్స్తో పాటు 3 అధునాతన బెర్తుల నిర్మాణం కోసం టెండర్లను పిలవాలని ఏపీ మారిటైమ్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఒక్కో బెర్తును 900 మీటర్ల పొడవుతో బహుళ ఉత్పత్తుల కార్గోను నిర్వహించేలా నిర్మాణం చేపట్టనున్నారు. బాహ్య, అంతర్గత మౌలిక సదుపాయాల నిర్మాణంలో భాగంగా 15.52 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్రెడ్జింగ్ చేసి పోర్టు వద్ద లోతు తవ్వేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశ పోర్టు నిర్మాణాన్ని 36 నెలల్లో పూర్తి చేయాలని టెండర్లలో పేర్కొన్నారు.